Harmanpreet Kaur: లీడర్‌గా నా కర్తవ్యం పూర్తయింది.. సంచలన ప్రకటన చేసిన స్టార్ క్రికెటర్ హర్మన్‌‌ప్రీత్

Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 6 Oct 2026 11:53 AM IST
Harmanpreet Kaur
X

Harmanpreet Kaur: లీడర్‌గా నా కర్తవ్యం పూర్తయింది.. సంచలన ప్రకటన చేసిన స్టార్ క్రికెటర్ హర్మన్‌‌ప్రీత్

Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్‌ జట్టుకు సుదీర్ఘకాలంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లీడర్‌గా తన కర్తవ్యం పూర్తయిందని, అయితే కేవలం క్రీడాకారిణిగా మాత్రం జట్టు కోసం మరింతకాలం కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

‘‘అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌ బాధ్యతల నుంచి ఈ రోజు దిగిపోతున్నా. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాల ప్రయాణం ఇది. భారత మహిళల క్రికెట్ కోసం, ఈ జట్టు కోసం నా సర్వశక్తులూ ధారపోశా’’ అని హర్మన్‌ పేర్కొన్నారు.

జట్టు ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రదర్శనలను పక్కన పెట్టానని, కొన్నిసార్లు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించుకుని మరీ కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. తాను తీసుకున్న ప్రతి నిర్ణయం జట్టు పురోగతి కోసమేనని స్పష్టం చేశారు.

ప్రస్తుత భారత మహిళల జట్టు ఎంతో అద్భుతమైన స్థితిలో ఉందని, జట్టులో ఉన్న ప్రతిభావంతులైన యంగ్‌ ప్లేయర్లు భవిష్యత్తుపై పూర్తి నమ్మకం కలిగిస్తున్నారని.. అందుకే తన కర్తవ్యం పూర్తయినట్లు భావిస్తున్నానని చెప్పారు.

కెప్టెన్సీ మాత్రమే ముగిసిందని, క్రికెట్ పట్ల తన ప్రేమకు ఎప్పటికీ ముగింపు ఉండదని తెలిపారు. ఆటగాడిగా తన ప్రయాణం కొనసాగుతుందని, తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, తోటి ఆటగాళ్లు మరియు కుటుంబసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సారథిగా మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ అనేక చారిత్రాత్మక విజయాలను అందించారు. గతేడాది నవంబర్‌లో ఆమె నాయకత్వంలోని భారత జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి చరిత్ర సృష్టించగా.. ఇటీవలే ఆసియా క్రీడల్లోనూ వరుసగా రెండోసారి స్వర్ణ పతకం నెగ్గి దూసుకుపోతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.