ఐపీఎల్ వల్లే డిప్రెషన్లోకి వెళ్లా.. దూరంగా ఉండి సంతోషంగా ఉన్నా.. స్టార్ బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు!
Harry Brook on IPL Criticism: ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ వల్లే డిప్రెషన్లోకి వెళ్లా.. దూరంగా ఉండి సంతోషంగా ఉన్నా.. స్టార్ బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు!
Harry Brook on IPL Criticism: ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో తన తొలి సీజన్లో విమర్శలను ఎదుర్కొన్నానని తెలిపాడు. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో ఎదురైన తీవ్ర విమర్శలు తనపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడించాడు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను పదేపదే చూడటం వల్ల తాను తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయానని చెప్పాడు. ముఖ్యంగా తన ఇన్నింగ్స్‌లపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలను గమనించడం తనకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌కు దూరంగా ఉండి.. ఇప్పుడు సంతోషంగా ఉన్నా అని బ్రూక్ చెప్పుకొచ్చాడు.
'ఐపీఎల్లో ఉన్నప్పుడు విమర్శలు, సోషల్ మీడియా కారణంగా నేను ఓ రకమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అది మైదానంలోనూ, వ్యక్తిగతంగానూ నాపై ప్రభావం చూపింది. అందుకే సోషల్ మీడియాకు పూర్తిగా దూరం కాకపోయినా.. అందులో వచ్చే విషయాలను వెతికి మరీ చూడకూడదని నిర్ణయించుకున్నాను' అని హ్యారీ బ్రూక్ వెల్లడించాడు. 2023 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్రూక్ 190 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అద్భుతమైన సెంచరీ చేసి తన బ్యాటింగ్ సత్తాను చాటాడు. ఆ సెంచరీకి ముందు తన ఇన్నింగ్స్‌లపై తీవ్ర విమర్శలు వచ్చాయని, శతకం సాధించిన తర్వాత విమర్శకులకు సమాధానం చెప్పిన భావన కలిగిందని బ్రూక్ తెలిపాడు.
తనపై విమర్శలు రావడం మంచి విషయం కాదని, మరో కోణంలో చూస్తే అవి తనపై ఉన్న అంచనాలకు సంకేతమని హ్యారీ బ్రూక్ అభిప్రాయపడ్డాడు. అభిమానులు తన ఆటపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే.. తాను మరింత మెరుగ్గా ఆడగలనని వారు భావిస్తున్నారని చెప్పాడు. బ్రూక్ ప్రస్తుతం ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన తర్వాత అతడిని ఫ్రాంచైజీ విడుదల చేసింది. 2024 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.4 కోట్లకు తీసుకుంది. అయితే తన అమ్మమ్మ మరణించడంతో బ్రూక్ ఆ సీజన్ నుంచి వైదొలిగాడు.
2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మరోసారి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. వరుసగా ఐపీఎల్ నుంచి వైదొలగడంతో.. బీసీసీఐ అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో 2027 వరకు బ్రూక్ ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 2028 మెగా వేలంలోనే తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో తన నిషేధం గురించి మాట్లాడిన బ్రూక్.. తాను తీసుకున్న నిర్ణయాలపై పెద్దగా పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం తనకు ముఖ్యమని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో ఎదురైన విమర్శలు తనకు ఒక పాఠంగా మారాయని, ముఖ్యంగా సోషల్ మీడియా స్పందనలను ఎలా తీసుకోవాలో నేర్చుకున్నానని ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు.. మంచి ఫామ్ మీదున్నాడు. భవిష్యత్తులో ఐపీఎల్‌లోకి తిరిగి వస్తే.. అతడికి కాసుల వర్షం కురవడం పక్కా.




