Harshit Rana Injury: హర్షిత్ రాణా.. అధిక బరువే హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి కారణమా?

Harshit Rana's hamstring injury has raised fresh fitness concerns. టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఫిట్‌నెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Rishvik
Published on: 16 July 2026 7:59 PM IST
Harshit Rana Injury
X

Harshit Rana Injury: హర్షిత్ రాణా.. అధిక బరువే హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి కారణమా?

Harshit Rana Injury: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఫిట్‌నెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన తొలి సిరీస్‌లోనే హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం కావడం భారత జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా పునరావాస సమయంలో హర్షిత్ బరువు పెరగడం వల్లే ఈ గాయం అయ్యి ఉండొచ్చని పలు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

24 ఏళ్ల హర్షిత్ రాణా ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో టీ20 సందర్భంగా కుడి హ్యామ్‌స్ట్రింగ్‌లో అసౌకర్యం కలగడంతో స్కాన్లు నిర్వహించగా.. గ్రేడ్-1 హ్యామ్‌స్ట్రింగ్ గాయం ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే అంతకంటే పెద్ద ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే.. జట్టులో చేరే సమయానికి హర్షిత్ అధిక బరువుతో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని హర్షిత్ రాణాను కీలక బౌలర్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక ఉందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయడమే కాకుండా.. ఎనిమిదో స్థానంలో మంచి బ్యాటర్‌గా కూడా అతడిని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అయితే ఫాస్ట్ బౌలింగ్ చేసే ఆటగాడు అధిక బరువుతో ఉంటే శరీరంపై ఒత్తిడి పెరిగి హ్యామ్‌స్ట్రింగ్ గాయాల ప్రమాదం ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనోడిని ఏరికోరి మరీ జట్టులోకి తెచ్చాడు. అయితే హర్షిత్ మాత్రం వరుస గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు.

మరోవైపు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్‌పైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్‌లో విరిగిన కాలివేలితో ఆడిన వరుణ్ పూర్తిగా కోలుకోకముందే మళ్లీ జట్టులోకి వచ్చాడని తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లకే అతడికి గ్రేడ్-2 హ్యామ్‌స్ట్రింగ్ గాయం కావడంతో జింబాబ్వే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. వచ్చే నెలలో 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వరుణ్‌ను ఆసియా క్రీడల వరకు కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ.. 2028 ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్ ప్రణాళికల్లో అతడికి స్థానం దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హర్షిత్ రాణా విషయంలో మాత్రం ఫిట్‌నెస్, బరువు నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత జట్టు భవిష్యత్ ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించాలంటే.. అతడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ను సాధించడం అత్యంత కీలకంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story