HCA: తెలంగాణ క్రికెట్ ప్రక్షాళనకు హెచ్‌సీఏ భారీ స్కెచ్
HCA: తెలంగాణ క్రికెట్ ప్రగతి కోసం హెచ్‌సీఏ మెంటార్‌గా భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను నియమించారు.
HCA: తెలంగాణ క్రికెట్ ప్రక్షాళనకు హెచ్‌సీఏ భారీ స్కెచ్
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో క్రికెట్ అభివృద్ధి దిశగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో HCA జనరల్ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత మాజీ క్రికెటర్, అనుభవజ్ఞుడైన కోచ్ వసీం జాఫర్‌ను HCA మెంటార్‌గా నియమించినట్లు వెల్లడించారు.
రెండేళ్ల కాలపరిమితితో ఆయన సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అండర్-14, అండర్-16, అండర్-19 క్రీడాకారులతో పాటు అన్ని వయసుల ఆటగాళ్లు, రంజీ క్రికెటర్లు, మహిళా జట్టు అభివృద్ధికి వసీం జాఫర్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వసీం జాఫర్‌కు హెడ్ కోచ్ బాధ్యతలు కాకుండా ఆటగాళ్లు, కోచ్‌లకు సాంకేతిక మార్గనిర్దేశం చేసే బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
తెలంగాణలో గ్రామీణ, జిల్లా స్థాయి క్రికెట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని పాత జిల్లా కేంద్రాల్లో క్రికెట్ అకాడమీలు, ఆధునిక గ్రౌండ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన జిల్లాల్లో 7 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో గ్రౌండ్స్, ప్లేయింగ్ ఫెసిలిటీస్, డార్మిటరీలు, కోచ్‌ల వసతి, మెస్, క్యాంటీన్, వాష్‌రూమ్‌లతో కూడిన సమగ్ర క్రికెట్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే సూర్యాపేట, జగిత్యాల, నాగర్‌కర్నూల్, సిద్దిపేట ప్రాంతాల్లో దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో BCCI ప్రమాణాలతో నాలుగు అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో ఏసీ రెసిడెన్షియల్ రూమ్స్, ఫ్లడ్‌లైట్స్, తాత్కాలిక స్టాండ్స్ వంటి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. రాబోయే సీజన్ నుంచి ఇనిస్టిట్యూషన్ టీమ్‌లను A, B, C డివిజన్లుగా విభజించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా దాదాపు 600 మంది కొత్త ఆటగాళ్లకు లీగ్ వ్యవస్థలోకి వచ్చే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
జిల్లా ఆటగాళ్లకు ప్రాధాన్యత కల్పిస్తూ C-డివిజన్‌లో 8 జిల్లా జట్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా జట్లలో ఆడే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి అని, D-డివిజన్‌లో ఆడిన వారు C-డివిజన్‌కు అర్హులు కాదని స్పష్టం చేశారు. TG-20 టోర్నమెంట్‌లో ఎనిమిది జట్ల క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని, రాబోయే మూడేళ్లలో నిజామాబాద్, ఆదిలాబాద్ జట్లకు ఫ్రాంచైజీలు ఎంపిక చేసి మొత్తం పది ఉమ్మడి జిల్లాల జట్లతో TG-20 లీగ్‌ను కొనసాగించేందుకు ప్రణాళికలు ఉన్నాయని జీవన్ రెడ్డి, అంబటి రాయుడు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న T20 టోర్నమెంట్‌కు మీడియా, స్పాన్సర్లు, తల్లిదండ్రులు, అభిమానుల నుంచి వస్తున్న మద్దతుపై HCA ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 12న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యమంత్రి, గవర్నర్‌లను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నుంచి నాణ్యమైన క్రికెటర్లను తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే HCA లక్ష్యమని మన్నె జీవన్ రెడ్డి, అంబటి రాయుడు స్పష్టం చేశారు.




