Heinrich Klaasen: ఓ ప్లాన్, పద్దతి లేకుండా పోయింది.. అంతా ఐపీఎల్ వల్లే.. క్లాసెన్‌ సంచలన వ్యాఖ్యలు!

Heinrich Klaasen: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Rishvik
Published on: 29 April 2026 8:45 PM IST
Heinrich Klaasen
X

Heinrich Klaasen: ఓ ప్లాన్, పద్దతి లేకుండా పోయింది.. అంతా ఐపీఎల్ వల్లే.. క్లాసెన్‌ సంచలన వ్యాఖ్యలు!

Heinrich Klaasen: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆట స్వరూపమే పూర్తిగా మారిపోయిందన్నాడు. గతంలో ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేసుకుని.. పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి వచ్చేది.

ఇప్పుడు ఆ అవసరం పూర్తిగా తగ్గిపోయిందన్నాడు. నంబర్ 7 ఆటగాడు ఇప్పుడు 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడని.. దాంతో మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాల్సి వస్తోందని క్లాసెన్ పేర్కొన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రభావం మ్యాచ్‌లను బాగా ప్రభావితం చేస్తుందని క్లాసెన్ అభిప్రాయపడ్డాడు.

వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మాట్లాడాడు. 'నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు జట్టుకు ఏం అవసరమో అదే చూస్తాను. నా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే నితీశ్ రెడ్డి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతడు బంతిని చాలా బాగా హిట్ చేస్తున్నాడు.

అందుకే నాకు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్ని మ్యాచ్‌లలో మాత్రం ప్రారంభం నుంచే అగ్రెసివ్‌గా ఆడాల్సి వచ్చింది. వాటిలో కొన్ని నేను బాగా ఆడాను, కొన్నింటిలో ఆడలేదు. అయినప్పటికీ జట్టు అవసరాలే నాకు ముఖ్యం. ఈరోజు కూడా మా జట్టుకు మంచి ఆరంభం దక్కుతుందని ఆశిస్తున్నాను. అదే జరిగితే దూకుడుగా ముందుకు సాగుతాం' అని చెప్పాడు.

ప్రస్తుతం క్రికెట్ పూర్తిగా అగ్రెసివ్‌గా మారుతోందా? అనే ప్రశ్నకు హెన్రిచ్ క్లాసెన్ స్పందించాడు. 'నిజానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆ పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్నట్లుగా ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేయడం, పరిస్థితులకు తగ్గట్టు ఆడడం తగ్గిపోయింది. సాధారణంగా 7వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఇప్పుడు 8-9 స్థానాల్లోకి వెళ్లిపోతున్నాడు.

దీంతో మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడే అవకాశం లభిస్తోంది. 230 స్కోర్ ఇప్పుడు సాధారణ అవుతోంది. అయితే అది పిచ్‌పై ఆధారపడి ఉంటుంది. ఓపెనర్లు పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా దాడి చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఓపెనింగ్ నుంచే ఓవరుకు 15-16 పరుగులు చేస్తున్నారు. ఇది గతంలో చాలా అరుదుగా కనిపించేది. ముందు 2-3 బౌండరీలు కొట్టి, తర్వాత స్మార్ట్‌గా ఆడేవారు. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు అటాక్ చేస్తూనే ఉంటున్నారు' అని హెన్రిచ్ క్లాసెన్ తెలిపాడు.

'నా బ్యాటింగ్‌ను చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.. అలాగే నంబర్ 3లో ఇషాన్ కిషన్ మంచి స్టార్ట్ ఇస్తే నాకు మధ్య ఓవర్లలో ధాటిగా ఆడటం సులభమవుతుంది. టాప్ ఆర్డర్ ఓవరుకు 15-16 పరుగులు చేస్తే అది జట్టుకు చాలా ఉపయోగకరం.

అప్పుడు మేం కూడా దూకుడుగా ఆడుతాం. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. అందుకే మాకు మంచి ఆరంభం ఉండాలని ఆశిస్తున్నాను' అని క్లాసెన్ కోరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో అతడు ఒకడు. అతడిని రూ.3.07 కోట్లకు సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story