R Praggnanandhaa : నార్వే చెస్ టోర్నీలో భారత్ సంచలనం.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఆర్‌.ప్రజ్ఞానంద!

R Praggnanandhaa : భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు.

CR Reddy
Published on: 6 Jun 2026 7:28 AM IST
R Praggnanandhaa
X

R Praggnanandhaa

R Praggnanandhaa : అంతర్జాతీయ చదరంగంలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నార్వే చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో క్లాసికల్ విభాగంలో టైటిల్ కైవసం చేసుకున్నాడు. టోర్నమెంట్ చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన క్రీడాకారుడు విన్సెంట్ కీమర్‌పై ప్రజ్ఞానంద మైండ్ బ్లాక్ గేమ్ ఆడి విజయం సాధించాడు. ఈ విజయంతో నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా 20 ఏళ్ల ప్రజ్ఞానంద సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

లాస్ట్ రౌండ్ లో అదిరిపోయే ట్విస్ట్

ఈ టోర్నీ పది రౌండ్ల ప్రారంభానికి ముందు ప్రజ్ఞానంద 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే ఫైనల్ రౌండ్‌లో విన్సెంట్ కీమర్‌ను చిత్తు చేయడంతో అతని ఖాతాలో అమూల్యమైన 3 పాయింట్లు చేరాయి. ఇదే సమయంలో అప్పటివరకు 15.5 పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉన్న అమెరికన్ గ్రాండ్ మాస్టర్ వెస్లీ సీ.. తన పదో రౌండ్ మ్యాచ్‌ను ఫ్రాన్స్ ఆటగాడు అలీరెజాతో డ్రా చేసుకున్నాడు. దీనివల్ల వెస్లీ సీ 17 పాయింట్ల వద్దే నిలిచిపోగా.. ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లి అజేయ ఛాంపియన్‌గా నిలిచాడు.

ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సన్‌కే చుక్కలు

ప్రజ్ఞానందకు ఇది కేవలం రెండో నార్వే చెస్ టోర్నీ మాత్రమే కావడం విశేషం. ఈ టోర్నమెంట్‌లో అత్యంత హైలైట్ ఏంటంటే.. ఇప్పటివరకు ఏడుసార్లు నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఏకంగా రెండుసార్లు ఓడించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. టోర్నీ ప్రారంభంలో మొదటి ఆరు రౌండ్లలో మూడింటిలో ఓడిపోయినప్పటికీ, ప్రజ్ఞానంద ఎక్కడా అధైర్యపడకుండా అద్భుతంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు రౌండ్లలో బ్యాక్-టు-బ్యాక్ విజయాలు సాధించి టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు.

మరో భారత స్టార్ గుకేశ్‌కు చేదు అనుభవం

ఒకవైపు ప్రజ్ఞానంద విజయకేతనం ఎగురవేయగా.. మరో భారత స్టార్ ప్లేయర్ డి. గుకేశ్‌కు ఈ టోర్నీలో చేదు అనుభవం ఎదురైంది. టోర్నమెంట్ చివరి రౌండ్‌లో గుకేశ్.. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ టోర్నీ పొడుగునా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన గుకేశ్.. కేవలం 8 పాయింట్లతో టేబుల్ లో చివరి స్థానానికి పరిమితమయ్యాడు. ఏదేమైనప్పటికీ ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయం భారత క్రీడారంగంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టంగా నిలిచిపోతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story