Rohit Sharma : గాయం తర్వాత గర్జించిన పులి.. 21 రోజుల తర్వాత 7 సిక్సర్లతో రోహిత్ విధ్వంసం

Rohit Sharma : 21 రోజుల విరామం తర్వాత రోహిత్ శర్మ అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. లక్నోపై 7 సిక్సర్లతో 84 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరపున సరికొత్త రికార్డు సృష్టించాడు.

CR Reddy
Published on: 5 May 2026 6:27 AM IST
Rohit Sharma
X

Rohit Sharma

Rohit Sharma : ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. గాయం కారణంగా గత 21 రోజులుగా ఆటకు దూరమైన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, మళ్ళీ తన ఇలాకా అయిన వాంఖడే స్టేడియంలో బ్యాట్ పట్టుకుని ఊచకోత కోశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం బంతితోనే కాదు, ఫ్యాన్స్ హృదయాలతో కూడా ఆడుకున్నాడు. వచ్చిన వెంటనే ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి, తన ఫామ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. గత నెలలో ఇదే వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో విలవిలలాడాడు. ఆనాడు తన సొంత ప్రేక్షకుల ముందే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం రోహిత్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధించింది. ఆ గాయం వల్ల వరుసగా 5 మ్యాచ్‌లకు దూరమైన రోహిత్, సరిగ్గా 21 రోజుల తర్వాత మళ్ళీ అదే మైదానంలోకి అడుగుపెట్టాడు. తన రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు కన్నుల పండుగ చేస్తూ, తొలి ఓవర్ నుంచే తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.

సిక్సర్ల వేట - 27 బంతుల్లోనే బాదుడు

లక్ష్యం పెద్దదైనా, రోహిత్ మైదానంలో ఉంటే ఏదీ అసాధ్యం కాదని మరోసారి రుజువైంది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్, లక్నో బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను దారుణంగా దెబ్బతీశాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో ఇది అతనికి రెండో హాఫ్ సెంచరీ. ఇందులో 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ ఆడుతున్న తీరు చూస్తుంటే అసలు అతను గాయం నుంచి కోలుకుని వచ్చాడా లేక ప్రాక్టీస్ నెట్స్‌లో ఆడుతున్నాడా అనిపించేలా సాగింది అతని బ్యాటింగ్.

సెంచరీ చేజారినా.. రికార్డులు సొంతం

రోహిత్ తన వ్యక్తిగత సెంచరీకి చేరువవుతున్న తరుణంలో 14వ ఓవర్‌లో మనిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికి అతని ఖాతాలో 44 బంతుల్లో 84 పరుగులు చేరాయి. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ మిస్ అయినా, రోహిత్ తన ఓపెనింగ్ పార్టనర్ రాయన్ రికెల్టన్‌తో కలిసి ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక గొప్ప రికార్డును నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి కేవలం 10.5 ఓవర్లలోనే 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ముంబై చరిత్రలో సరికొత్త రికార్డు

ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సార్లు సెంచరీ (100+) ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా రోహిత్ - రికెల్టన్ రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఇప్పటివరకు మూడుసార్లు ఈ ఫీట్ సాధించారు. అంతకుముందు ఈ రికార్డు పార్థివ్ పటేల్ - లెండిల్ సిమన్స్ పేరిట ఉండేది (2 సార్లు). ఈ సీజన్‌లో ముంబై ఆశలు సజీవంగా ఉండాలంటే రోహిత్ బ్యాట్ ఇలాగే ఝుళిపించడం చాలా అవసరం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story