15 ఏళ్లకే వైభవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా ఎలా మారాడు!

Vaibhav Sooryavanshi: గత 2024 మధ్య కాలంలో బీహార్ నుంచి ఒక 13 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు వాటిని కేవలం పుకార్లుగానే కొట్టిపారేశారు.

Venkat
Published on: 14 Jun 2026 6:59 PM IST
Vaibhav Sooryavanshi
X

15 ఏళ్లకే వైభవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా ఎలా మారాడు!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికై, సాక్షాత్తూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును తుడిచేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించాడు బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ వేదికగా పరుగుల సునామీ సృష్టించిన ఈ నయా సంచలనం వెనుక ఉన్న కఠోర శ్రమను అతని చిన్ననాటి కోచ్ తాజాగా వెల్లడించారు.

రూమర్ అనుకున్నారు.. కానీ రికార్డుల రాజుగా మారాడు!

గత 2024 మధ్య కాలంలో బీహార్ నుంచి ఒక 13 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు చాలామంది వాటిని కేవలం పుకార్లుగానే కొట్టిపారేశారు. కానీ, రెండేళ్లు తిరిగేసరికి ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. వన్డేలు, టీ20లు, మల్టీ-డే మ్యాచ్‌లు.. ఇలా ఫార్మాట్ ఏదైనా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ వీరవిహారం చేస్తున్నాడు. తాజాగా కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 సీనియర్ జట్టులో చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

రూ.1.10 కోట్ల వేలం.. విమర్శకుల నోళ్లు మూయించిన ఐపీఎల్ ప్రదర్శన!

గత 2025 ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.1.10 కోట్లు పెట్టి ఈ కుర్రాడిని కొనుగోలు చేసినప్పుడు, ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడంటూ విమర్శలు వచ్చాయి. కానీ, ఆ అపనమ్మకాలను వైభవ్ తన బ్యాట్‌తోనే పటాపంచలు చేశాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో రికార్డుల వేట సాగించిన అతను, తాజా ఐపీఎల్ 2026 సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లోనే కాకుండా అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు బాది భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. ఇప్పుడు ప్రత్యర్థి జట్లు అతడిని ఒక చిన్నపిల్లాడిగా చూడటం లేదు, వైభవ్ వికెట్ పడితే ఒక ప్రపంచ స్థాయి బ్యాటర్‌ను అవుట్ చేసినట్లు సంబరాలు చేసుకుంటున్నారంటేనే అతని విశ్వరూపం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

రోజూ 600 బంతులకు పైగా ప్రాక్టీస్.. సీక్రెట్ విప్పిన కోచ్!

క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ 'బ్యాక్‌లిఫ్ట్' కలిగిన ఈ 15 ఏళ్ల టీ20 కింగ్ ఇంతటి ప్రతిభను ఎలా సొంతం చేసుకున్నాడు? దీనిపై అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా స్పందిస్తూ ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని పంచుకున్నారు.

"మేము నెట్స్‌లో వైభవ్ ఎన్ని బంతులు ఆడాడనేది ఎప్పుడూ లెక్కించలేదు. కానీ రోజుకు కనీసం 600 బంతులకు పైగా ఆడేవాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మొదట నేను స్వయంగా అలసిపోయే వరకు దాదాపు 200 నుంచి 300 బంతులను త్రో-డౌన్ వేసేవాడిని. నేను అలసిపోయాక మా అకాడమీ సహాయక సిబ్బంది, ఆపై అకాడమీ బౌలర్లు అతనికి బౌలింగ్ చేసేవారు. అందరూ అలసిపోయినా ఇంకా సమయం మిగిలి ఉంటే, బౌలర్లను గ్రూపులుగా విభజించి మరీ అతనికి నిరంతరాయంగా ప్రాక్టీస్ చేయించేవాళ్లం" అని కోచ్ వివరించారు.

సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల నాటి రికార్డు బద్దలు!

ఈ అసాధారణ ప్రతిభే అతనికి భారత సీనియర్ జట్టులో చోటు కల్పించింది. 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే భారత జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ తన 16వ ఏట తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవ్వగా, వైభవ్ అంతకంటే ముందే ఆ ఘనత సాధించి అత్యంత పిన్న వయసులో భారత జట్టుకు ఎంపికైన పురుషుల క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

గాయాల బారిన పడకుండా, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, రాబోయే రోజుల్లో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరెన్నో సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్తుకు ఈ బీహార్ కెరటం ఒక దిక్సూచిలా మారబోతోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story