Bhuvneshwar Kumar: టీమిండియాలో ఆడాలనే ఆసక్తి లేదు.. నా టార్గెట్ అదే.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Bhuvneshwar Kumar: Bhuvneshwar Kumar Opens Up on India Comeback. భారత జట్టులోకి తిరిగి రావడంపై వస్తున్న చర్చలకు భువనేశ్వర్ కుమార్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు.
Bhuvneshwar Kumar: టీమిండియాలో ఆడాలనే ఆసక్తి లేదు.. నా టార్గెట్ అదే.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Bhuvneshwar Kumar: భారత జట్టులోకి తిరిగి రావడంపై వస్తున్న చర్చలకు టీమిండియా సీనియర్ పేసర్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియాలో ఆడాలనే ఆసక్తి పెద్దగా లేదని, ఒకవేళ మళ్లీ అవకాశం వస్తే మాత్రం గొప్పగా భావిస్తా అని చెప్పాడు. ప్రస్తుతం తన జీవితం సాఫీగానే ఉందని, తాను కేవలం క్రికెట్‌పై ఉన్న ప్రేమతోనే ఆట కొనసాగిస్తున్నానని భువీ స్పష్టం చేశాడు. భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరఫున ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు దేశవాళీల్లో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి విజేతగా నిలవడంలో భువీ కీలక పాత్ర పోషించాడు.
2027 వన్డే ప్రపంచ కప్‌కు భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి భారత జట్టులోకి తీసుకురావాలని ఇటీవల మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో భువీ టీమిండియా ఎంట్రీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా భువనేశ్వర్ స్పందిస్తూ.. భారత జట్టులోకి తిరిగి రావాలనే ఒత్తిడి తనపై లేదని చెప్పాడు. 'భారత్‌కు ఆడటం నా కల. ఆ కల ఇప్పటికే నెరవేరింది. ఇప్పటికే చాలా సాధించా, ప్రత్యేకంగా సాధించాల్సిందేమీ లేదు. మళ్లీ అవకాశం వస్తే ఆనందమే. కానీ ఇప్పుడు రీఎంట్రీ కోసం ఆత్రుతగా ఎదురుచూడడం లేదు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడుతున్నది కేవలం ఆటపై ఉన్న ప్రేమ వల్లే' అని భువీ పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత తన కుటుంబమే తనకు ఎంతో మానసిక బలాన్ని ఇచ్చిందని భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. 'ఇంట్లో ఎప్పుడూ భారత జట్టులో ఎంపిక, ఎందుకు అవకాశం రాలేదు, ఏమి తప్పు జరిగిందనే చర్చలు జరగవు. క్రీడల్లో తరాల మార్పు సహజం. ప్రతి ఆటగాడు ఎప్పుడో ఒకప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే. నేను కూడా దానిని అంగీకరించాను. ఇప్పుడు ఎలాంటి బాధ, పశ్చాత్తాపం లేకుండా ప్రశాంతంగా ఉన్నాను. క్రమశిక్షణతో ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐపీఎల్‌లో ఆడుతున్నా. దేశవాళీలోనూ బరిలోకి దిగుతున్నా. యూపీ టీ20 లీగ్ ఆడా. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా' అని వెల్లడించాడు.
భారత ఫాస్ట్ బౌలింగ్ విప్లవానికి ఐపీఎల్‌తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక కారణమని భువనేశ్వర్ కొనియాడాడు. 'దేశంలోని యువ బౌలర్లు, బ్యాటర్లకు ఐపీఎల్ మంచి అవకాశాలను కల్పిస్తోంది. యువ టాలెంట్ గుర్తించి పరిణతి సాధించే వరకూ అండగా నిలుస్తోంది. చాలా మంది మంచి నైపుణ్యం ఉన్న పేసర్లను ఐపీఎల్ వెలుగులోకి తీసుకొచ్చింది. భారత్‌లోని పిచ్‌లు స్పిన్‌కు సహకరిస్తుంటాయి. విదేశీ పిచ్‌లు పేస్‌కు అనుకూలం. భారత ఫాస్ట్ బౌలింగ్ విప్లవానికి ఐపీఎల్ సహా కోహ్లీ, రవిశాస్త్రి కీలకం. విదేశీ పర్యటనలకు ముందు స్వదేశంలో కూడా పేసర్లకు అనుకూలమైన పిచ్‌లు సిద్ధం చేయించడం వారి దూరదృష్టికి నిదర్శనం' అని భువీ ప్రశంసించాడు.
అలాగే మీరట్‌లో తన క్రికెట్ ప్రయాణం ప్రారంభమైన రోజులను గుర్తుచేసుకున్న భువీ.. మాజీ భారత పేసర్ ప్రవీణ్ కుమార్ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని చెప్పాడు. ఒకే అకాడమీ నుంచి వచ్చిన ఇద్దరి బౌలింగ్ శైలి కూడా చాలా దగ్గరగా ఉండేదని, ఆయనను గమనిస్తూ ఎంతో నేర్చుకున్నానని వివరించాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్, యూపీ టీ20 లీగ్‌లలో ఆడుతూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్న భువనేశ్వర్.. పరిమిత క్రికెట్ ఆడుతూ, శరీరానికి తగిన విశ్రాంతి కూడా ఇస్తున్నాడు. భారత జట్టులోకి మళ్లీ అవకాశం వస్తే స్వాగతిస్తానని, కానీ ఇప్పుడు తన జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ క్రికెట్‌ను ఆస్వాదించడమే ముఖ్యమని భువీ స్పష్టం చేశాడు.




