IND vs PAK: మరోసారి భారత్-పాకిస్థాన్ పోరు.. ట్రై సిరీస్‌కు ఐసీసీ కసరత్తులు.. ఎప్పుడంటే?
India vs Pakistan Tri Series: ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయిన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌లతో కూడిన ముక్కోణపు సిరీస్‌ను నిర్వహించే అవకాశాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి పరిశీలిస్తోంది.
IND vs PAK: మరోసారి భారత్-పాకిస్థాన్ పోరు.. ట్రై సిరీస్‌కు ఐసీసీ కసరత్తులు.. ఎప్పుడంటే?
India vs Pakistan Tri Series: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆదరణ కలిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను మళ్లీ మైదానంలోకి తెచ్చేందుకు ఐసీసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలోనే ముఖాముఖిగా తలపడుతున్న ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య ముక్కోణపు సిరీస్ (Tri-series) నిర్వహించే ప్రతిపాదనను అంతర్జాతీయ క్రికెట్ మండలి పరిశీలిస్తోంది. ఈ సిరీస్ ఖరారైతే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లేదా యూఏఈ వేదికలుగా నిర్వహించే అవకాశం ఉంది.
రెండు దశాబ్దాల క్రితం ఆమ్‌స్టెల్‌వీన్‌లో చివరి పోరు..
భారత్, పాకిస్థాన్‌ల మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరగ్గా, ఈ రెండు జట్లు కలిసి ముక్కోణపు టోర్నీలో పాల్గొని దాదాపు రెండు దశాబ్దాలు దాటింది. చివరిసారిగా 2004లో నెదర్లాండ్స్‌లో ఆస్ట్రేలియాతో కలిసి జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. ఆమ్‌స్టెల్‌వీన్‌లో వర్షం కారణంగా 33 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 192/6 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (68) రాణించగా, భారత బౌలర్ లక్ష్మీపతి బాలాజీ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా 27 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. వీవీఎస్ లక్ష్మణ్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అఫ్రిది, మాలిక్ చెరో మూడుకు పైగా వికెట్లతో మొత్తం 7 వికెట్లు పంచుకున్నారు.
ముక్కోణపు సిరీస్‌లలో పాక్ ఆధిపత్యం..
ప్రస్తుతం ఐసీసీ టోర్నీలలో భారత్‌దే పైచేయిగా ఉన్నప్పటికీ, ముక్కోణపు సిరీస్‌ల చరిత్రలో పాకిస్థాన్‌దే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తుంది. ఇరుజట్లు ట్రై-సిరీస్‌లలో మొత్తం 27 సార్లు తలపడగా, పాకిస్థాన్ 20 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, భారత్ కేవలం 7 విజయాలకే పరిమితమైంది. వన్డేల్లో ఇరుజట్ల ముఖాముఖి రికార్డులోనూ పాక్ 73-58 తేడాతో ఆధిక్యంలో ఉంది.
వన్డేల పునరుజ్జీవానికి సరికొత్త ప్రణాళికలు..
ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌కు క్రేజ్ తగ్గుతున్న తరుణంలో ఎఫ్‌టీపీ (FTP) ద్వారా ముక్కోణపు టోర్నీలకు తిరిగి జీవం పోయాలని ఐసీసీ భావిస్తోంది. భారత్ చివరిసారిగా 2015లో, పాక్ 2005లో వన్డే ముక్కోణపు సిరీస్ ఆడాయి. రాబోయే 18 నెలల్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఒక ట్రై-సిరీస్ ఆడే అవకాశాలున్నాయి.




