ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. రీఎంట్రీకి కొత్త మార్గదర్శకాలు.. జై షా సూపర్!

ICC: మహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది

Rishvik
Published on: 22 Jun 2026 7:46 PM IST
ICC
X

ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. రీఎంట్రీకి కొత్త మార్గదర్శకాలు.. జై షా సూపర్!

ICC: మహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసవం అనంతరం మహిళా ఆటగాళ్లు సురక్షితంగా, సమర్థవంతంగా తిరిగి క్రికెట్‌లోకి రావడానికి ప్రత్యేక మార్గదర్శకాలను సోమవారం ప్రకటించింది. 'రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్' పేరుతో విడుదల చేసిన ఈ విధానం మహిళా క్రికెటర్లకు మాతృత్వం తర్వాత కెరీర్‌ను కొనసాగించేందుకు మరింత మద్దతు అందించనుంది. తల్లిగా మారడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం మధ్య ఏ మహిళా నలిగిపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ ఛైర్మన్ జై షా తెలిపారు.

ఆరు Rలు:

ఐసీసీ కొత్త మార్గదర్శకాలు ప్రసవం తర్వాత 16 వారాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. ఇందులో మహిళా ఆటగాళ్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. దశలవారీగా క్రికెట్‌కు తిరిగి తీసుకురావడంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఐసీసీ ఈ విధానాన్ని 'ఆరు Rలు' (Ready, Review, Restore, Recondition, Return, Refine) అనే ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా రూపొందించింది. మొదటి దశలో ప్రసవం తర్వాత కోలుకునే ప్రక్రియపై దృష్టి పెట్టనున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్య సమీక్షలు నిర్వహిస్తారు. కొత్తగా తల్లిగా మారిన ప్లేయర్స్ మానసికంగా ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు సైకాలజికల్ సపోర్ట్ కూడా అందించనున్నారు. అనంతరం క్రమంగా ఫిట్‌నెస్, వ్యాయామాలు ప్రారంభించి.. ఎనిమిది వారాల తర్వాత వైద్యుల పర్యవేక్షణలో రన్నింగ్, క్రికెట్‌కు సంబంధించిన శిక్షణ మొదలుపెడతారు.

ప్రతి ప్లేయర్‌కి కేస్ మేనేజర్:

ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి ప్లేయర్‌కి ప్రత్యేకంగా ఒక 'కేస్ మేనేజర్'ను నియమించాలని ఐసీసీ సూచించింది. ఈ బాధ్యతను వైద్యుడు లేదా ఫిజియోథెరపిస్ట్ నిర్వర్తిస్తారు. మహిళా ప్లేయర్ శారీరక పరిస్థితి, కండరాల సమస్యలు, పెల్విక్ ఫ్లోర్ ఆరోగ్యం వంటి అంశాలను నిరంతరం పరిశీలించి.. పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడే మళ్లీ పోటీ క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తారు. ఐసీసీ మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జై షా మాట్లాడుతూ..

'తల్లిగా మారడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం మధ్య ఏ మహిళా ఆటగాడు ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి రావద్దు. ఈ మార్గదర్శకాలు మహిళా క్రికెట్‌కు మరింత సానుకూల వాతావరణాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మహిళా క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆటగాళ్ల సంక్షేమం, ప్రతిభావంతులైన క్రికెటర్ల కొనసాగింపు చాలా ముఖ్యం' అని అన్నారు.

బిడ్డకు జన్మనిస్తే కెరీర్ ముగిసినట్టే కాదు:

ఈ మార్గదర్శకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా జట్టు వైద్యురాలు డాక్టర్ ఫిలిప్పా ఇంగే మాట్లాడుతూ.. 'బిడ్డకు జన్మనివ్వడం అంటే కెరీర్ ముగిసినట్టే అనే భావనను మార్చడమే మా లక్ష్యం. మహిళా క్రికెటర్లు కుటుంబాన్ని చూసుకుంటూనే మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరుకునేలా ఈ విధానం సహాయపడుతుంది' అని తెలిపారు. ఈ విధానంలో శిక్షణ సౌకర్యాలు, పిల్లల సంరక్షణపై సలహాలు, మ్యాచ్ వేదికల్లో శిశువుకు పాలిచ్చే లేదా సంరక్షించే ప్రత్యేక ప్రదేశాలు, ప్రయాణ సౌకర్యాలు వంటి అంశాలపై కూడా దృష్టి సారించారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని ఐసీసీ సూచించింది.

ఐసీసీ అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి:

2021లో తన కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన అఫీ ఫ్లెచర్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. 'కుటుంబాన్ని చూసుకుంటూనే మళ్లీ క్రికెట్‌లోకి రావడానికి ఈ విధానం గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇది మహిళా క్రికెట్‌కు ఐసీసీ చేసిన అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి' అని ఆమె పేర్కొంది. మహిళా క్రికెటర్లకు మాతృత్వం, కెరీర్ రెండింటినీ సమతుల్యం చేసే దిశగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. ఇందులో కీలక పాత్ర పోషించిన జై షాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story