ICC Meeting: అహ్మదాబాద్‌లో ఐసీసీ కీలక సమావేశం.. పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ వస్తాడా?

ICC Meeting: ఐసీసీకీలక సమావేశం ఐపీఎల్ 2026 ఫైనల్ రోజు అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం.

Rishvik
Published on: 16 May 2026 5:37 PM IST
ICC Meeting
X

ICC Meeting: అహ్మదాబాద్‌లో ఐసీసీ కీలక సమావేశం.. పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ వస్తాడా?

ICC Meeting: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 ఫైనల్‌ మ్యాచ్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే 31న టైటిల్ సమరం జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక సమావేశం కూడా ఫైనల్ రోజు అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం. మే 30, 31 తేదీల్లో త్రైమాసిక సమావేశాలు నిర్వహించేందుకు ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రపంచ క్రికెట్ బోర్డుల ప్రధానులను ఒకేచోటకు తీసుకురావడానికి ఇదే సరైన సమయమని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ హాజరవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

ముందుగా ఈ సమావేశాన్ని మార్చి లేదా ఏప్రిల్‌లో ఖతార్‌లో నిర్వహించాలని ఐసీసీ భావించింది. కానీ పశ్చిమ ఆసియా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సమావేశాన్ని వాయిదా వేసి భారత్‌కు మార్చినట్లు తెలుస్తోంది. మే 21న ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వర్చువల్ మీటింగ్ నిర్వహించనుండగా. ఆ తర్వాత ప్రత్యక్ష సమావేశం అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉన్న రాజకీయ, క్రికెట్ ఉద్రిక్తతల నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ భారత్‌కు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

ఇటీవల ఆసియా కప్ 2025 సమయంలో కూడా భారత్-పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంది. మోసిన్ నఖ్వీ కప్పును టీమిండియాకు ఇవ్వకుండా చేసిన కుట్రలు అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. భారత కెప్టెన్ తన చేతుల మీదుగా కప్ అందుకోవాలి నఖ్వీ పట్టుబట్టాడు. భారత ఆటగాళ్లు మాత్రం పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించారు. దాంతో కప్ ఇంకా భారత్ వద్దకు చేరలేదు. అప్పటి నుంచి బీసీసీఐ, పీసీబీ మధ్య సంబంధాలు మరింత దూరమయ్యాయి.

మొహ్సిన్ నఖ్వీకి ఐపీఎల్ 2026 ఫైనల్‌కు హాజరుకావాలని ఆహ్వానం కూడా అందినట్లు పాకిస్థాన్ మీడియా అంటోంది. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని.. నఖ్వీ భారత్‌కు రావడం ఆశ్చర్యమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నఖ్వీ ఐసీసీ సమావేశంకు దాదాపుగా దూరం కానున్నాడనే తెలుస్తోంది. గత కొంతకాలంగా బీసీసీఐ, పీసీబీ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. భద్రతా కారణాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు బోర్డుల మధ్య సంబంధాలు ఏమంత బాగా లేవు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story