ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. టాప్-4లో ముగ్గురు మనోళ్లే!
Shubman Gill is one rating point behind World No.1 in ICC ODI Rankings. ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా కొనసాగింది.
ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. టాప్-4లో ముగ్గురు మనోళ్లే!
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-4లో ఏకంగా ముగ్గురు మనోళ్లే ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణించిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నంబర్-1 ర్యాంకుకు ఒక్క పాయింట్ దూరంలో నిలిచాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గిల్ 801 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గిల్ 188 పరుగులు చేయడంతో అతడి రేటింగ్ పాయింట్లు మెరుగయ్యాయి.
భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టాప్-4లో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. కింగ్ కోహ్లీ 767 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. హిట్‌మ్యాన్ రోహిత్ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-4లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. టాప్-4లో ముగ్గురు ఉండడంతో భారత బ్యాటింగ్ బలం మరోసారి ప్రపంచ క్రికెట్‌కు తెలిసింది. అయితే భారత బ్యాటర్లు రాణించినప్పటికీ.. ఇంగ్లండ్ 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో సీనియర్ బ్యాటర్ జో రూట్ అసాధారణ ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా మొత్తం 249 పరుగులు చేసిన రూట్.. నాలుగు స్థానాలు ఎగబాకి వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.
మరో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ 11 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 19వ స్థానంలో నిలవగా.. జాకబ్ బెతెల్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 64వ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్ కూడా వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించి వరుసగా 54, 62వ స్థానాలకు చేరుకున్నారు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ భారత్‌పై ఐదు వికెట్లు తీసి ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటి ఏడు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి ప్రవేశించగా.. అల్జారీ జోసెఫ్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 26వ స్థానానికి చేరుకున్నాడు. భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 10 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. న్యూజిలాండ్ స్టార్ మైఖేల్ బ్రేస్‌వెల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్‌లోనే అత్యుత్తమంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు.
తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా కీలక మార్పులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌తో సిరీస్ అనంతరం జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ కెరీర్‌లోనే అత్యుత్తమంగా తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్ 20వ స్థానానికి, సైఫ్ హసన్ 27వ స్థానానికి చేరుకున్నారు. బౌలర్ల విభాగంలో బంగ్లాదేశ్ స్పిన్నర్లు మహేదీ హసన్, రిషాద్ హొస్సేన్ వరుసగా 19, సంయుక్త 25వ స్థానాలకు చేరుకోగా.. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవా ఏకంగా 37 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. 892 పాయింట్లతో ఇషాన్ కిషన్ టాప్ లేపాడు. 858 పాయింట్లతో అభిషేక్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో సికిందర్ రజా టాప్-1లో ఉన్నాడు.




