ICC Verdict: పాకిస్థాన్‌కు ఐసీసీ భారీ ఊరట.. ఇకపై హ్యాపీగా ఆడుకోవచ్చు!

Big Relief for Pakistan Cricket. పాకిస్థాన్ క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి భారీ ఊరట లభించింది.

Rishvik
Published on: 20 Aug 2026 7:59 PM IST
ICC Verdict
X

ICC Verdict: పాకిస్థాన్‌కు ఐసీసీ భారీ ఊరట.. ఇకపై హ్యాపీగా ఆడుకోవచ్చు!

ICC Verdict: పాకిస్థాన్ క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి భారీ ఊరట లభించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పిచ్‌కు విధించిన డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ రద్దు చేసింది. దీంతో గడాఫీ స్టేడియం ఖాతాలో ప్రస్తుతం జీరో డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. జూన్ 4న పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో గడాఫీ స్టేడియం పిచ్‌కు మ్యాచ్ రిఫరీ ‘అన్‌సాటిస్‌ ఫ్యాక్టరీ’ రేటింగ్ ఇచ్చారు. ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ కింద ఈ రేటింగ్ ఇవ్వడంతో.. స్టేడియానికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.

అయితే మ్యాచ్ రిఫరీ నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పీల్ చేసింది. పీసీబీ అప్పీల్‌ను పరిశీలించిన ఐసీసీ ప్యానెల్.. మ్యాచ్ వీడియోలు, మ్యాచ్ రిఫరీ నివేదిక, అలాగే ఆ మ్యాచ్‌లో పాల్గొన్న ఇరు జట్ల కెప్టెన్ల వ్యాఖ్యలను పరిశీలించింది. మ్యాచ్ రిఫరీ సంబంధిత మార్గదర్శకాలను సరిగ్గానే అనుసరించారని ప్యానెల్ పేర్కొన్నప్పటికీ.. పిచ్‌ను అన్‌సాటిస్‌ ఫ్యాక్టరీగా పరిగణించాల్సినంత తీవ్ర సమస్యలు అందులో కనిపించలేదని తేల్చింది. ముఖ్యంగా గడాఫీ స్టేడియం పిచ్‌లో అతి బౌన్స్ లేదా అధిక స్పిన్ కనిపించలేదని ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ గుర్తించింది. దీంతో గతంలో విధించిన ఒక డీమెరిట్ పాయింట్‌ను పూర్తిగా రద్దు చేసింది. దాంతో గడాఫీ స్టేడియం రికార్డులో ఇప్పుడు ఎలాంటి డీమెరిట్ పాయింట్లు లేవు.

ఇదే సమయంలో కెనడాకు చెందిన మేపుల్ లీఫ్ క్రికెట్ మైదానంకు సంబంధించిన రెండు అప్పీళ్లను కూడా ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ పరిశీలించింది. జూన్ 8న అమెరికా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 మ్యాచ్‌లో పిచ్‌కు అన్‌సాటిస్‌ ఫ్యాక్టరీ రేటింగ్ ఇచ్చి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. అయితే ఈ పిచ్‌పై కూడా ప్యానెల్ ఊరటనిచ్చింది. ఉపరితలంలో అధిక అసమాన బౌన్స్, సీమ్ మూవ్‌మెంట్ లేదా అధిక స్పిన్ కనిపించలేదని.. అది సంతృప్తికరమైన పిచ్‌కు అనుగుణంగానే ఉందని పేర్కొంది. దీంతో ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా రద్దు చేసింది.

అయితే మేపుల్ లీఫ్ క్రికెట్ గ్రౌండ్‌పై మరో మూడు డీమెరిట్ పాయింట్లు మాత్రం కొనసాగనున్నాయి. జూన్ 16న కెనడా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పిచ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఐసీసీ ప్యానెల్ నిర్ధారించింది. అందువల్ల ఆ మ్యాచ్‌కు ఇచ్చిన ‘అన్‌ఫిట్’ రేటింగ్‌ను సమర్థిస్తూ మూడు డీమెరిట్ పాయింట్లను కొనసాగించింది. తాజా నిర్ణయాలతో లాహోర్ గడాఫీ స్టేడియం ఖాతాలో సున్నా డీమెరిట్ పాయింట్లు, మేపుల్ లీఫ్ క్రికెట్ గ్రౌండ్ ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు కొనసాగుతున్నాయి. గడాఫీ స్టేడియంపై విధించిన పాయింట్ రద్దు కావడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఊరట.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story