ఇమ్రాన్ ఖాన్‌కు హైకోర్టు షాక్.. బేషరతు క్షమాపణ చెప్పాల్సిందే..
Imran Khan: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) నిబంధనలను ఉల్లంఘిస్తూ..
ఇమ్రాన్ ఖాన్‌కు హైకోర్టు షాక్.. బేషరతు క్షమాపణ చెప్పాల్సిందే..
Imran Khan: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇటీవల ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు అధికారులు భారత్ విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం అఫిడవిట్ దాఖలు చేయడం లేదా కేవలం హామీ ఇవ్వడం సరిపోదని, ఈ వ్యవహారంలో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.
నిరసనల్లో ఎందుకు పాల్గొన్నారు?.. నటుడిని ప్రశ్నించిన కోర్టు
నిరసన కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇన్ని సంవత్సరాలుగా భారత్‌లో నివసిస్తున్నప్పటికీ, గతంలో ఎప్పుడూ ఇలాంటి నిరసనల్లో పాల్గొనని ఆయన, ఇప్పుడు అకస్మాత్తుగా ఈ కార్యక్రమంలో ఎందుకు భాగస్వామి కావాల్సి వచ్చిందని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ ఇదే తప్పును విదేశాల్లో ఉన్న ఏ భారతీయుడైనా చేసి ఉంటే, అక్కడి యంత్రాంగం మరుసటి విమానంలోనే వారిని వెనక్కి పంపించేసి ఉండేదని గుర్తుచేశారు.
OCI నిబంధనల ఉల్లంఘనపై కఠిన వైఖరి
విదేశీ పౌరుడిగా (OCI) భారతదేశంలో నివసించే వారు ఇక్కడి చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఓసీఐ నిబంధనల ఉల్లంఘనను తేలికగా తీసుకోలేమని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసిన న్యాయస్థానం, నిబంధనలను ఉల్లంఘించినందుకు నటుడు బేషరతు క్షమాపణలు తెలపాలని స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.




