IND vs AFG: రాహుల్, గిల్ శతకాలు.. న్యూ చండీగఢ్‌లో పరుగుల వరద.. డే 1 టీమిండియా స్కోర్ ఎంతంటే?

IND vs AFG: IND vs AFG Test Day 1 Score అఫ్గానిస్థాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఐపీఎల్ 2026 ఫామ్‌ను కొనసాగించారు.

Rishvik
Published on: 6 Jun 2026 6:31 PM IST
IND vs AFG
X

IND vs AFG: రాహుల్, గిల్ శతకాలు.. న్యూ చండీగఢ్‌లో పరుగుల వరద.. డే 1 టీమిండియా స్కోర్ ఎంతంటే?

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఐపీఎల్ 2026 ఫామ్‌ను కొనసాగించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 368 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103 పరుగులు), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (50 పరుగులు) అజేయంగా నిలిచారు. వీరిద్దరూ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో సలీమ్ సాఫి 2, రహ్మాన్ షరిఫి ఒక వికెట్ తీశాడు.

మొన్నటి వరకూ పొట్టి ఫార్మాట్ (ఐపీఎల్ 2026) మూడ్‌లో ఉన్న భారత ప్లేయర్లు.. సుదీర్ఘమైన టెస్టు ఫార్మాట్‌కు ఎలా అలవాటు పడతారనే అభిమానుల సంశయాలను ఓపెనర్లు పూర్తిగా పటాపంచలు చేశారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ (24) ఆరంభంలో ఎంతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు.

అయితే దూకుడుగా ఆడే క్రమంలో యశస్వి మొదటగా పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 139 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు.

కేఎల్ రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో 100 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు సాయి సుదర్శన్ (81) సెంచరీకి కాస్త దూరంలో అవుట్ కాగా.. శతకం మార్క్ అందుకున్న వెంటనే రాహుల్ కూడా వెనుతిరిగాడు. మధ్య ఓవర్లలో రెండు వికెట్లు త్వరగా పడినప్పటికీ.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ ఆకట్టుకున్నాడు.

మరో ఎండ్‌లో రిషభ్ పంత్ తన మార్క్ హిట్టింగ్‌తో అఫ్గాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలోనే టెస్టు కెరీర్‌లో 11వ శతకాన్ని గిల్ (103*) నమోదు చేశాడు. దూకుడుగా ఆడుతూ టెస్టుల్లో తన 19వ అర్ధశతకాన్ని (50*) పంత్ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే వరకు మరో వికెట్ పడకుండా శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ముగించారు. అఫ్గాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 2 వికెట్లు, రహ్మాన్ షరిఫి ఒక వికెట్ పడగొట్టారు.

ప్రస్తుతం భారత్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. గిల్, పంత్ రెండోరోజు మంచి ఆరంభం ఇస్తే.. భారత్ భారీ స్కోర్ చేయడం పక్కా. ఇంకా ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ ఇద్దరు మెరిస్తే.. 400-500 స్కోర్ పోయినా ఆశ్చర్యపోనక్కర్లే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story