IND vs AFG: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు భారత జట్లు ఇవే.. రోహిత్, హార్దిక్ ఎంపిక.. కానీ ట్విస్ట్ ఇదే!

IND vs AFG: సొంత గడ్డపై ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టెస్ట్, వన్డే సిరీస్‌కు బీసీసీఐ జట్లను ప్రకటించింది.

Rishvik
Published on: 19 May 2026 6:21 PM IST
IND vs AFG
X

IND vs AFG: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు భారత జట్లు ఇవే.. రోహిత్, హార్దిక్ ఎంపిక.. కానీ ట్విస్ట్ ఇదే!

IND vs AFG: ఐపీఎల్ 2026 ముగిసిన కొన్ని రోజులకే సొంత గడ్డపై ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టెస్ట్, వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్ ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు శుభ్‌మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. వన్డే జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. అయితే ఇద్దరూ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. ఇద్దరూ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ టెస్టులు క్లియర్ చేసిన తర్వాతే సిరీస్‌లో ఆడే అవకాశముందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.

శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా జట్టులో చోటు సంపాదించాడు. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దుబేలకు మొదటిసారిగా వన్డే జట్టులో అవకాశం లభించింది. టెస్ట్ జట్టులో కూడా కొన్ని ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. రవీంద్ర జడేజాకు ఈ టెస్ట్ మ్యాచ్‌కు విశ్రాంతి ఇచ్చారు. యువ స్పిన్నర్ మనవ్ సుతార్, పేసర్ గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యారు. వీరిద్దరూ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నారు.

సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గురించి సెలక్షన్ కమిటీ చర్చించలేదని చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. రిషబ్ పంత్‌ టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకున్నా.. వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. భారత్-ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్‌లో జరిగే ఏకైక టెస్ట్‌తో ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ ద్వారా బీసీసీఐ యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మనవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే, ధ్రువ్ జురెల్.

భారత వన్డే జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story