IND vs AFG: టీమిండియాకు డబుల్ షాక్.. కోహ్లీనే కాదు రోహిత్ కూడా అవుట్!

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.

Rishvik
Published on: 4 Jun 2026 6:06 PM IST
IND vs AFG
X

IND vs AFG: టీమిండియాకు డబుల్ షాక్.. కోహ్లీనే కాదు రోహిత్ కూడా అవుట్!

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటుపై అనిశ్చితి నెలకొంది. తొడ కండరాల గాయం కారణంగా కింగ్ వన్డే సిరీస్‌ నుంచి వైదొలుగుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా మరో న్యూస్ బయటికొచ్చింది. ఐపీఎల్ 2026 సందర్భంగా గాయపడిన రోహిత్.. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.

ఏఎన్‌ఐ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 సమయంలో రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. అయినప్పటికీ అతడిని అఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు. అయితే అతని అందుబాటు పూర్తిగా ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే జట్టుతో చేరనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

అయితే ఇప్పటివరకు రోహిత్ శర్మ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రిపోర్ట్ చేయలేదని, దీంతో అతడు సిరీస్‌ను మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో రోహిత్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 283 పరుగులు చేశాడు. 35.37 సగటుతో రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అతని అత్యధిక స్కోరు 84 పరుగులు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న రోహిత్ వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20లకు, 2025లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మ చివరిసారిగా వన్డే కెప్టెన్‌గా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 76 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం. ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అతడు 42 బంతుల్లో 75 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు.

భారత్-అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 13న ధర్మశాల వేదికగా తొలి వన్డే, జూన్ 17న ఏక్‌నా స్టేడియంలో రెండో వన్డే, జూన్ 20న చెపాక్‌ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే రోహిత్, విరాట్ ఇద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అన్న విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story