IND vs ENG: సూర్యవంశీ అరంగేట్రం.. సస్పెన్స్ పెంచిన శ్రేయస్ అయ్యర్!

IND vs ENG: వైభవ్ అరంగేట్రంపై శ్రేయస్ అయ్యర్ సమాధానం ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగించాడు.

Rishvik
Published on: 30 Jun 2026 9:49 PM IST
IND vs ENG
X

IND vs ENG: సూర్యవంశీ అరంగేట్రం.. సస్పెన్స్ పెంచిన శ్రేయస్ అయ్యర్!

IND vs ENG: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. అయితే తొలి టీ20కు ముందు భారత అభిమానులందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి అయినా అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా? అని.ఈ ప్రశ్నకు భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగించాడు.

ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో భారత ఓపెనర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 49 పరుగులు చేసినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. మరోవైపు సంజు శాంసన్ వరుసగా 5, 0 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టులో మార్పులు జరిగే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఐపీఎల్‌ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని అభిమానులు, మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20కు ముందు జరిగిన మీడియా సమావేశంలో వైభవ్ గురించి ప్రశ్నించగా.. శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.

'జట్టులో ఒక ఆటగాడు మాత్రమే కాదు, అందరూ మంచి ప్రదర్శన చేశారు. ప్రతి ఆటగాడికి భద్రతాభావం కల్పిస్తూ అవకాశాలు ఇవ్వడం చాలా ముఖ్యం. అలా చేస్తే భవిష్యత్ టోర్నీల్లో వారు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలుగుతారు. టీ20 ప్రపంచకప్‌ 2026ను గెలిపించిన ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లో మా ప్రధాన బలాలు. అందుకే వారికి మద్దతుగా నిలవడం అవసరం' అని అయ్యర్ చెప్పాడు. వైభవ్ తొలి టీ20లో అరంగేట్రం చేస్తాడా? అని మరోసారి నేరుగా ప్రశ్నించగా.. శ్రేయస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 'ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. జట్టు కాంబినేషన్ గురించి మేము తీసుకునే నిర్ణయాలు పూర్తిగా అంతర్గత విషయాలు. అవి చాలా గోప్యమైనవి. ప్రత్యర్థి జట్టుకు మా ప్రణాళికలను ముందుగానే చెప్పలేం' అని స్పష్టం చేశాడు.

అయితే వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై మాత్రం శ్రేయస్ ప్రశంసలు కురిపించాడు. 'వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన యువ ఆటగాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా రాణించే సామర్థ్యం అతడికి ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు జట్టుకు మంచి సేవలు అందిస్తాడనే నమ్మకం మాకు ఉంది' అని అన్నాడు. వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో, మాజీల నుంచి వస్తున్న ఒత్తిడి గురించి ప్రశ్నించగా.. శ్రేయస్ ఆసక్తికరంగా స్పందించాడు. 'అలాంటి విషయాలను నేను పట్టించుకోను. నేను సోషల్ మీడియాను ఫాలో అవ్వను. వార్తలను కూడా ఎక్కువగా చూడను. కాబట్టి బయట ఏం చర్చ జరుగుతుందో నాకు తెలియదు' అని చెప్పాడు.

ఐర్లాండ్ సిరీస్‌లో బ్యాటింగ్ వైఫల్యం తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో టీమ్ మేనేజ్‌మెంట్ మార్పులు చేస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మ్యాచ్ ప్రారంభానికి ముందు తేలనుంది. అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు సంజు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. చూడాలి మరి బుడ్డోడు అరంగేట్రం చేస్తాడో లేదో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story