IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. అదే తప్పు మళ్లీ చేస్తే భారీ మూల్యం తప్పదు!

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత్ సిద్దమైంది.

Rishvik
Published on: 30 Jun 2026 8:47 PM IST
IND vs ENG
X

IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. అదే తప్పు మళ్లీ చేస్తే భారీ మూల్యం తప్పదు!

IND vs ENG: ఐర్లాండ్ చేతిలో 0-2తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం సిద్దమైంది. ఐర్లాండ్ పర్యటనలో రెండు పరాజయాలను చవిచూసిన భారత్.. ఇంగ్లీష్ గడ్డపాడు మంచి ఆరంభం కోసం చూస్తోంది. బుధవారం చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరిగే తొలి టీ20లో అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే ఉంది. ఐర్లాండ్ సిరీస్‌లో అవకాశం రాని 15 ఏళ్ల వైభవ్‌కు ఈసారి తుది జట్టులో చోటు దక్కుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ మాట్లాడుతూ.. ప్రతి ఆటగాడిలాగే వైభవ్ కూడా తన అవకాశానికి ఎదురుచూడాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు అతడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని కూడా పేర్కొన్నారు. ఐర్లాండ్ సిరీస్ పరాజయం తర్వాత జట్టులో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉండటంతో వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం లేకపోలేదు. ఐర్లాండ్ సిరీస్‌లో ఓపెనర్ సంజు శాంసన్ వరుసగా విఫలమవడంతో టీమ్ మేనేజ్‌మెంట్‌ మార్పులు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 49 పరుగులతో ఆకట్టుకున్న అభిషేక్ శర్మతో కలిసి వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపే అవకాశాలపై చర్చ సాగుతోంది.

మరోవైపు ఇషాన్ కిషన్ కూడా రెండు మ్యాచ్‌ల్లో 1, 12 పరుగులకే పరిమితమవడంతో అతడి స్థానంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జట్టులోని ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడకుండా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సెలెక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఉంది. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవడం ఒక్కటే భారత బ్యాటింగ్ సమస్యలకు పరిష్కారం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐర్లాండ్‌లో స్వింగ్, బౌన్స్‌కు అనుకూలమైన పిచ్‌లపై భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దూకుడుగా ఆడే అవకాశం లేకపోవడంతో పరిస్థితులకు అనుగుణంగా తమ ఆటను మార్చుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయారు. రెండో టీ20లో తిలక్ వర్మ ఓపికగా అర్ధశతకం సాధించినప్పటికీ చివర్లో అతడు కూడా ఒత్తిడికి లోనయ్యాడు.

ఇంగ్లండ్‌లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశముంది. అయితే ఆతిథ్య జట్టు బౌలింగ్ దళం మరింత బలంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సాకిబ్ మహ్మూద్, సోనీ బేకర్ వంటి పేసర్లు,.. ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్ వంటి స్పిన్నర్లు భారత బ్యాటర్లకు గట్టి సవాల్ విసరనున్నారు. రివర్‌సైడ్ గ్రౌండ్‌లో ఇప్పటివరకు జరిగిన ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగటు స్కోరు కేవలం 138 మాత్రమే. అంటే అక్కడ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మరోవైపు భారత బౌలర్ల ప్రదర్శన కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ప్రారంభంలో వికెట్లు తీసినా.. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సూర్యాంశ్ షెడ్గే ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌పై ఇదే తప్పు చేస్తే.. భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు.

ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో కెప్టెన్ హ్యారీ బ్రూక్‌తో పాటు జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, జేకబ్ బెతెల్, టామ్ బాంటన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు. వీరిని కట్టడి చేయడం భారత బౌలర్లకు పెద్ద పరీక్షగా మారనుంది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సిరీస్ ఓటమిని తప్పించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన నిరాశను మరచి.. ఇంగ్లండ్‌పై విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని అతడు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? లేదా మేనేజ్‌మెంట్ సీనియర్ల పైనే మరోసారి నమ్మకం ఉంచుతుందా? అనేది మ్యాచ్‌కు ముందు తేలనుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story