IND vs ENG : భారత్ 189 పరుగులు చేసినా లాభం లేకపాయె.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయకుండానే మ్యాచ్ క్లోజ్

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చేస్టర్-లే-స్ట్రీట్ మైదానంలో వరుసగా మూడోసారి మ్యాచ్ రద్దు కావడం, భారత ఇన్నింగ్స్ హైలైట్స్ చూద్దాం.

CR Reddy
Published on: 2 July 2026 6:18 AM IST
IND vs ENG
X

IND vs ENG

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లోనే అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయింది. డర్హమ్ కౌంటీలోని చేస్టర్-లే-స్ట్రీట్ మైదానంలో బుధవారం (జూలై 1) జరిగిన ఈ హై-వోల్టేజ్ ముఖాముఖి మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం తేలకుండానే రద్దయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ఇంగ్లాండ్ జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి అడుగుపెట్టే లోపే వర్షం పడటం ప్రారంభమైంది. ఆ వాన ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లకు ఉన్న పాత బ్యాడ్ సెంటిమెంట్ మరోసారి నిజమైంది.

24 ఏళ్లలో మారని సీన్..

చేస్టర్-లే-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడటం ఇది మూడోసారి. విశేషం ఏంటంటే.. ఈ మైదానంలో జరిగిన మూడు మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగానే రద్దయ్యాయి. గతంలో 2002, 2011 లలో ఇక్కడ రెండు వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఆ రెండు మ్యాచుల్లో కూడా భారత జట్టు మొదట బ్యాటింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి వాన పడి మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు 2026 లో తొలిసారిగా ఇక్కడ టీ20 మ్యాచ్ ఆడినా.. అదే పాత సీన్ రిపీట్ కావడం గమనార్హం. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మొదలైన చినుకులు, ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు చేరగానే పెద్ద వర్షంగా మారి మ్యాచ్‌ను పూర్తిగా చెడగొట్టాయి.

వైభవ్‌కు రాని అవకాశం.. సంజూ, ఈషాన్ కిషన్ల ఫ్లాప్ షో

ఈ మ్యాచ్‌లో కూడా అభిమానులు ఎంతగానో ఆశపడ్డ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. మేనేజ్‌మెంట్ అతని అరంగేట్రంపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. ఇక ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ సంజూ శాంసన్ (1 రన్) ఈ పర్యటనలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫెయిల్ కాగా.. మరో ఓపెనర్ ఈషాన్ కిషన్ (0) వరుసగా రెండో మ్యాచ్‌లో రన్ అవుట్ రూపంలో దురదృష్టవశాత్తూ వెనుదిరిగాడు. కేవలం రెండు ఓవర్ల లోపే ఓపెనర్లు ఇద్దరూ అవుట్ కావడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడింది.

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్

టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఇంగ్లాండ్ బౌలర్లను వణికించాడు. అతను 24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆయిర్‌లాండ్ సిరీస్‌లో విఫలమైన అయ్యర్.. ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్‌గా తన మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులు చేయగా, ఆఖర్లో శివమ్ దూబే 21 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి మెరుపుల వల్లే భారత్ 189 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story