IND vs ENG 2nd ODI: భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..రూట్ సెంచరీ మిస్!

IND vs ENG 2nd ODI: కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

Naresh.k
Published on: 17 July 2026 7:37 AM IST
IND vs ENG 2nd ODI
X

IND vs ENG 2nd ODI: భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..రూట్ సెంచరీ మిస్!

India vs England: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తించింది. తొలి వన్డేలో తగిలిన దెబ్బకు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు గట్టిగానే బదులిచ్చింది. స్టార్ బ్యాటర్ జో రూట్ క్లాస్ ఇన్నింగ్స్‌కు తోడు, అదృష్టం కూడా కలిసి రావడంతో టీమిండియాపై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసి, చివరి వన్డేను ఫైనల్ ఫైట్‌గా మార్చేసింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని బౌలర్లు నిరూపించారు. పిచ్‌పై ఉన్న తేమను అందిపుచ్చుకుంటూ భారత ఓపెనర్లను ఆరంభం నుంచే కట్టడి చేశారు.రోహిత్ శర్మ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ 26 పరుగులకే వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ కాసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా 31 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడుతూ అద్భుత హాఫ్ సెంచరీ(66) సాధించాడు. అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత భారత మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. అక్షర్ పటేల్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ వరుసగా విఫలం కావడంతో భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌట్ అయింది. చివర్లో జస్ప్రీత్ బుమ్రా చేసిన 20 పరుగులు భారత్‌కు ఆమాత్రం స్కోరైనా అందించాయి.

234 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాక్‌లు ఇచ్చారు. కానీ, ఇంగ్లాండ్ నయా వాల్ ‘జో రూట్’ క్రీజులో పాతుకుపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా క్లాసిక్ షాట్లతో భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చిన రూట్, దురదృష్టవశాత్తూ 99 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీ చేజార్చుకున్నాడు. అయినప్పటికీ అతని వీరోచిత ఇన్నింగ్స్ సాయంతో ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది.

భారత జట్టు తక్కువ స్కోరైనా డిఫెండ్ చేసుకునేందుకు గట్టిగానే పోరాడింది. కానీ, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే గాయపడిన సుందర్, బౌలింగ్‌కు రాలేకపోయాడు. సుందర్ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్‌కు ఆరో బౌలర్ ఆప్షన్ లేకుండా పోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఈ బలహీనతను సరిగ్గా వాడుకుని సునాయాసంగా పరుగులు రాబట్టారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story