IND vs ENG 2nd ODI: ఆ ఇద్దరిపైనే టీమిండియా ఆందోళన.. రెండో వన్డేకు ముందు ఓ శుభవార్త!
Shubman Gill Fitness Worry India Ahead of 2nd ODI vs England. రెండో వన్డేకు ముందు భారత జట్టును రెండు కీలక అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
IND vs ENG 2nd ODI: ఆ ఇద్దరిపైనే టీమిండియా ఆందోళన.. రెండో వన్డేకు ముందు ఓ శుభవార్త!
IND vs ENG 2nd ODI:ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. గురువారం సాయంత్రం 5.30కు కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగే రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఈ వన్డే గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. అయితే రెండో వన్డేకు ముందు భారత జట్టును రెండు కీలక అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ప్రధాన సమస్యగా మారాయి.
తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడుతూ 80 పరుగులు చేశాడు. అయితే గిల్ తీవ్ర అసౌకర్యంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. లేదంటే గిల్ శతకం బాదేవాడు. అది కేవలం కండరాల నొప్పి (క్రాంప్స్) మాత్రమేనని జట్టు భావిస్తున్నప్పటికీ.. గతంలో ఇలాంటి సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు గిల్ ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలమైన సమయంలో గిల్ అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు అతడు కూడా దూరమైతే.. టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుంది. అందుకే గిల్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ వైద్య బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది.
రోహిత్ శర్మకు ఫిట్‌నెస్ సమస్యలు లేకపోయినా.. అతడి బ్యాటింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత దూకుడైన ఆటతీరును తగ్గించిన రోహిత్.. పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమవుతున్నాడు. గత ఏడాది అక్టోబర్ నుంచి 13 వన్డేల్లో 563 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రతి మ్యాచ్‌లోనూ ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. మరోవైపు కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత 10 వన్డేల్లో 621 పరుగులు చేయగా.. మూడు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు చేశాడు. మొదటి మ్యాచులో విఫలమైనా.. కోహ్లీపై నమ్మకం ఉంది.
భారత జట్టుకు శుభవార్త ఏమిటంటే.. దాదాపు 968 రోజుల తర్వాత వన్డేల్లోకి తిరిగొచ్చిన జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లోనే తన మాయాజాలాన్ని చూపించాడు. బుమ్రా మరోసారి మంచి ఆరంభం ఇస్తే.. ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితమవుతుంది. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇద్దరూ కీలక భాగస్వామ్యంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. అక్షర్ బంతితోనూ నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
రెండో వన్డే కోసం భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. సోఫియా గార్డెన్స్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో యువ పేసర్ గుర్నూర్ బ్రార్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో బ్రార్ రెండు వికెట్లు తీసినప్పటికీ.. 9 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కీలక మ్యాచ్ కాబట్టి అర్ష్‌దీప్ వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావచ్చు.




