IND vs ENG 5th T20I: సంజుకు ఛాన్స్.. తెలుగోడికి మరో అవకాశం.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs ENG 5th T20I Playing XI. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది.

Rishvik
Published on: 11 July 2026 5:25 PM IST
IND vs ENG 5th T20I
X

IND vs ENG 5th T20I: సంజుకు ఛాన్స్.. తెలుగోడికి మరో అవకాశం.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs ENG 5th T20I: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను 3-0తో కోల్పోయిన టీమిండియా.. చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. టీ20ల్లో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌ అయిన జట్టు.. పసికూన ఐర్లాండ్‌, ఇంగ్లండ్ చేతిలో కంగుతింది. ఐదవ టీ20లోనైనా గెలిచి ఉన్న పరువు అయినా నిలబెట్టుకుంటుందా? లేదా మరో వైట్‌వాష్‌తో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత ప్లేయింగ్ 11లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో సంజు శాంసన్‌కు అవకాశం రానుందని తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపని ఇషాన్ కిషన్‌ను తుది జట్టు నుంచి తప్పించి.. సంజును తీసుకునే అవకాశం ఉంది. అయితే సంజు ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో ఆడనున్నట్లు సమాచారం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆడుతాడు. వరుసగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు మరో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఐదో టీ20లో అయినా తన సత్తా నిరూపించుకోకుంటే అంతే సంగతులు.

యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. వరుసగా విఫలమవుతున్న శివమ్‌ దూబే స్థానంలో స్థానంలో సూర్యాంశ్ ఆడనున్నాడు. ఒకవేళ దూబే ఆడితే వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగం లోనూ మార్పులు తప్పవు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్‌ యాదవ్, అక్షర్‌ పటేల్‌ కీలకం కానున్నారు. గాయపడిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించలేదు. దీంతో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే టీమ్ మేనేజ్‌మెంట్ తుది జట్టును ఎంపిక చేయనుంది. మొత్తంగా ఐదో టీ20 కోసం భారత జట్టులో పలు మార్పులు జరగడం ఖాయం.

ప్రస్తుతం భారత జట్టులోని ప్రతి ప్లేయర్ ఐపీఎల్‌ 2026లో పరుగుల వరద పారించారు. కానీ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం దాదాపుగా అందరూ నిరాశపరిచారు. ఇప్పటివరకు శ్రేయస్ అయ్యర్, అభిషేక్‌ శర్మ మాత్రమే కాస్త మెరుగైన ప్రదర్శన చేశారు. దీంతో భారత బ్యాటర్లు ఫ్లాట్‌ పిచ్‌ల మీదే ఆడుతారనే అభిప్రాయం వినిపిస్తోంది. విదేశీ పర్యటనల్లో 1-2 మ్యాచ్‌ల్లో తడబడ్డా.. తర్వాత పుంజుకోవడం టీమిండియా బ్యాటర్లకు అలవాటే. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి బిన్నంగా ఉంది. ఆటగాళ్లు అందరూ కలిసికట్టుగా విఫలమవుతున్నారు, మరోవైపు బ్యాటర్లతో పోల్చుకుంటే బౌలర్లు కాస్త మెరుగైన ప్రదర్శన చేస్టున్నారు. ఐదో టీ20లో సమిష్టి ప్రదర్శన చేస్తేనే విజయం సాధ్యమవుతుంది.

భారత్ తుది జట్టు (అంచనా):

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్‌ యాదవ్.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story