IND vs PAK: ఈసారి కూడా నో షేక్ హ్యాండ్.. భారత జట్టులో కీలక మార్పులు!

IND vs PAK: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్థాన్ పోరు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.

Rishvik
Published on: 14 Jun 2026 7:10 PM IST
IND vs PAK
X

IND vs PAK: ఈసారి కూడా నో షేక్ హ్యాండ్.. భారత జట్టులో కీలక మార్పులు!

IND vs PAK: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్థాన్ పోరు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌నే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడుతుండటంతో అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. అయితే మ్యాచ్‌కు ముందు మరోసారి 'నో షేక్ హ్యాండ్' అంశం చర్చనీయాంశంగా మారింది.

భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ సారథి ఫాతిమా సనాతో కరచాలనం చేయలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత అభిమానులు హర్మన్‌ప్రీత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పురుషుల టీ20ప్రపంచ కప్ 2026, ఆసియా కప్ 2026లో కూడా ఇండో-పాక్ ప్లేయర్స్ కరచానలం చేసుకోలేదు.

టాస్ అనంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నామని తెలిపింది. గత ప్రపంచ కప్ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగిందని, అదే జోరును ఈ టోర్నీలో కొనసాగించాలని భావిస్తున్నామని పేర్కొంది. టోర్నీకి ముందు సన్నాహకాల్లో జట్టు పలు లోపాలను సరిదిద్దుకున్నామని హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. ఇక ఇప్పుడు మంచి క్రికెట్ ఆడటంపైనే పూర్తి దృష్టి పెట్టామని చెప్పింది. జట్టు కూర్పులో కూడా కీలక మార్పులు చేసినట్లు తెలిపింది. యస్తికా భాటియా ఇటీవల మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో భర్తి ఫుల్‌మాలిని తుది జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు మీడియం పేసర్లతో బరిలోకి దిగుతోంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కాంబినేషన్‌ను ఎంచుకున్నట్లు కౌర్ తెలుస్తోంది. ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లోనే దాయాది పాకిస్థాన్‌ను ఎదుర్కొంటున్న భారత జట్టు విజయంతో టోర్నీని ప్రారంభించాలని చూస్తోంది. మరోవైపు పాకిస్థాన్ కూడా సంచలన విజయంపై కన్నేసింది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల దృష్టి నిలిచింది.

తుది జట్లు:

భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), భార్తీ ఫుల్మాలి, రిచా ఘోష్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్‌.

పాకిస్తాన్: మునీబా అలీ (వికెట్‌కీపర్), గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, సైరా జబీన్, నటాలియా, అలియా రియాజ్, ఫాతిమా సనా (కెప్టెన్), రమీన్ షమీమ్‌, నష్రా సంధు, సాదియా ఇక్బాల్, రుబాబ్ తస్మియా.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story