Auqib Nabi: ఇన్నాళ్ల నిరీక్షణకు తెర.. తొలి ఆటగాడిగా చరిత్ర.. కానీ నబీకి నిరాశ తప్పదు!

Auqib Nabi: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టులో అకీబ్ నబీ చోటు దక్కించుకున్నాడు.

Rishvik
Published on: 13 Aug 2026 7:23 PM IST
Auqib Nabi
X

Auqib Nabi: ఇన్నాళ్ల నిరీక్షణకు తెర.. తొలి ఆటగాడిగా చరిత్ర.. కానీ నబీకి నిరాశ తప్పదు!

Auqib Nabi: జమ్మూ కశ్మీర్‌కు పేసర్ అకీబ్ నబీకి ఎట్టకేలకు భారత జట్టులో చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. చాలాకాలంగా టీమిండియాలో అవకాశం రాలేదు. చివరకు శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో.. ఆ ఖాళీని నబీతో బీసీసీఐ సెలెక్టర్లు భర్తీ చేశారు. దీంతో భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న తొలి జమ్మూ కశ్మీర్ ఆటగాడిగా నబీ చరిత్ర సృష్టించాడు.

గత రెండు సీజన్లుగా దేశవాళీ క్రికెట్‌లో అకీబ్ నబీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏకంగా 104 వికెట్లు పడగొట్టి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడంలో నబీ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 60 వికెట్లు తీసి జట్టు చారిత్రక టైటిల్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇంత అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. భారత జట్టులో చోటు కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చింది. 2026 ఐపీఎల్‌లోనూ నబీకి అవకాశం లభించింది. అయితే సీనియర్ భారత జట్టులోకి పిలుపు మాత్రం రాలేదు. ఆఫ్ఘనిస్థాన్‌తో న్యూచండీగఢ్‌లో జరిగిన ఏకైక టెస్టు కోసం భారత జట్టును ప్రకటించిన సమయంలో నబీకి చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవాళీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్నప్పటికీ అతడిని సెలెక్టర్లు పట్టించుకోలేదంటూ క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

టీమిండియాలో చోటు రాకున్నా అకీబ్ నబీ మాత్రం తన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాడు. ఇటీవల గాలెలో భారత్ ‘ఎ’ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అతడు ఆరు వికెట్లు పడగొట్టి మరోసారి తన సత్తా చాటాడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు. చివరకు జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో భారత టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. టీమిండియాలో చోటుపై నబీ స్పందిస్తూ.. తనకు అవకాశం వస్తుందనే నమ్మకం ఉండేదని తెలిపాడు. క్రికెటర్‌గా తన పని మైదానంలో అద్భుతంగా ప్రదర్శన ఇవ్వడమేనని, మిగతా విషయాలను సెలెక్టర్లు చూసుకుంటారని చెప్పాడు. తాను బాగా ఆడుతున్నందున ఏదో ఒకరోజు భారత జట్టులో చోటు దక్కుతుందని నమ్మానని నబీ చెప్పుకొచ్చాడు.

‘నాకు టీమిండియా నుంచి పిలుపు వస్తుందని నమ్మకం ఉంది. క్రికెటర్‌గా నా పని మంచి ప్రదర్శన ఇవ్వడం. మిగతా విషయాలను ఇతరులు చూసుకుంటారు. ఈరోజు కాకపోతే రేపైనా భారత జట్టులో చోటు సంపాదిస్తాననే నమ్మకం ఉండేది. ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ఫలితం దక్కింది. నేను బౌలింగ్ చేసేటప్పుడు నా పని వికెట్లు తీయడమే అని భావిస్తాను. మిగతాది దేవుడి చేతుల్లోనే ఉంటుంది. టీమిండియా నుంచి పిలుపు రావడంతో నా కుటుంబం ఎంతో సంతోషించింది. ఇన్నాళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు. తుది జట్టులో చోటు దక్కితే కచ్చితంగా వికెట్స్ తీస్తా' అని నబీ ధీమా వ్యక్తం చేశాడు. లంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి.. భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. మహ్మద్ సిరాజ్‌కు తోడుగా గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరిని తుది జట్టులో చోటు దక్కుతుంది. దాంతో నబీకి నిరాశ తప్పేలా లేదు.

బరాముల్లాలోని షీరీ గ్రామంలోని సాధారణ మైదానాల్లో ప్రారంభమైన నబీ ప్రయాణం.. ఇప్పుడు భారత టెస్టు జట్టు వరకు చేరుకుంది. దేశవాళీ క్రికెట్‌లో అతడు పడిన కష్టానికి గుర్తింపుగా లభించిన ఈ అవకాశం నబీ కెరీర్‌లో కీలక మలుపుగా మారనుంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో నబీకి తుది జట్టులో చోటు లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అరంగేట్రం చేసే అవకాశం వస్తే.. జమ్మూ కశ్మీర్ నుంచి భారత టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలి ఆటగాడిగా మరో చరిత్రను సృష్టించనున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story