IND vs SL 1st Test Day 3: శ్రీలంక 284 ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం.. ముందుగానే ఆట ముగింపు!

IND vs SL 1st Test Day 3: గాలె వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది.

Rishvik
Published on: 17 Aug 2026 6:09 PM IST
IND vs SL 1st Test Day 3
X

IND vs SL 1st Test Day 3: శ్రీలంక 284 ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం.. ముందుగానే ఆట ముగింపు!

IND vs SL 1st Test Day 3: గాలె వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియాకు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే సమయం కంటే ముందుగానే మ్యాచ్ క్లోజ్ అయింది. భారీ వర్షం వచ్చే సూచనలు కనిపించడంతో.. శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే మూడో రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 రన్స్ చేసింది.

సోమవారం మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే భారత్ 462 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్‌ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించింది. చివరి వికెట్‌గా ప్రసిద్ధ్‌ కృష్ణ (2) పెవిలియన్‌కు చేరాడు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో భారీ శతకం చేశాడు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా.. ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీ బాదాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు పోగొట్టాడు. కేశర నువంత మూడు వికెట్లు, ఆసిత ఫెర్నాండో రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్‌లోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్‌ మదుష్క (0)ను సిరాజ్‌ ఔట్ చేశాడు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతికే చండిమాల్ (4)ను పెవిలియన్‌కు చేర్చాడు. 14 ఓవర్లో మరో ఓపెనర్ లాహిరు ఉదారా (27)ను కూడా సుతార్‌ పెవిలియన్‌కు చేర్చాడు. కాసేపటికే కమిందు మెండిస్ (14)ను కుల్దీప్ యాదవ్ (16.1వ ఓవర్‌) పెవిలియన్ చేర్చాడు. 10 ఓవర్ల అనంతరం రవీంద్ర జడేజా (26.1వ ఓవర్) కెప్టెన్ ధనంజయ (21) అవుట్ చేశాడు. 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆతిథ్య జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సోనల్ దినూష, ఏడో స్థానంలో వచ్చిన నిరోషన్ డిక్వెల్లా అద్భుతంగా పోరాడారు.

దినూష-నిరోషన్ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు ఏకంగా 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శ్రీలంకను ఆదుకున్నారు. డిక్వెల్లా 115 బంతుల్లో 80 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డిక్వెల్లా ఔటైన తర్వాత కూడా దినూష తన పోరాటాన్ని కొనసాగించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 168 బంతుల్లో 100 పరుగులు చేశాడు. దాంతో శ్రీలంక 284 పరుగుల వరకు చేరుకోగలిగింది. అయితే దినూషకు మిగతా బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించలేదు. డిక్వెల్లా, దినూష మినహా శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. దీంతో భారత బౌలర్లు చివరికి శ్రీలంక ఇన్నింగ్స్‌ను 284 పరుగులకు ముగించారు.

భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంక వెన్ను విరిశాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. గాలె పిచ్‌పై స్పిన్నర్లకు అనుకూల పరిస్థితులు ఉండడంతో.. జడేజా, సుతార్ వికెట్ల వేట కొనసాగించారు. శ్రీలంక ఆలౌట్ అయిన తర్వాత మూడో రోజు ఆటలో మరింత సమయం ఉన్నప్పటికీ.. గాలెలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీయడంతో పాటు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. వర్షం ఇంకా ప్రారంభం కాకపోయినా.. భారీ వర్షం వచ్చే సూచనలు కనిపించడంతో గ్రౌండ్ సిబ్బంది మైదానంలో కవర్లు కప్పారు. దీంతో అంపైర్లు మూడో రోజు ఆటను ముందుగానే ముగించారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story