IND vs SL 1st Test: శ్రీలంకతో తొలి టెస్ట్.. గాలె ‘కింగ్’తో టీమిండియాకు పెను ముప్పు!
IND vs SL 1st Test: శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ టీమిండియాను హెచ్చరించాడు.
IND vs SL 1st Test: శ్రీలంకతో తొలి టెస్ట్.. గాలె ‘కింగ్’తో టీమిండియాకు పెను ముప్పు!
IND vs SL 1st Test: ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌పై ఉత్కంఠ నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 ఫైనల్ రేసులో నిలవాలంటే.. ఇరు జట్లకు ఈ సిరీస్ విజయం ఎంతో అవసరం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా.. శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. సొంతగడ్డపై శ్రీలంకను తక్కువ అంచనా వేయలేమని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో లంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ టీమిండియాను హెచ్చరించాడు. గాలె ‘కింగ్’తో పెను ముప్పు తప్పదని చెప్పాడు.
భారత బ్యాటర్లకు శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అతిపెద్ద సవాల్ అని ఫర్వీజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. 'గాలెలో ప్రభాత్ జయసూర్యకు అద్భుతమైన రికార్డు ఉంది. అందుకే అతడిని ‘కింగ్ ఆఫ్ గాలె’గా పిలుస్తాము. గాలె పరిస్థితులను, అక్కడి గాలిని ఉపయోగించుకుని బంతిని అద్భుతంగా తిప్పగల సామర్థ్యం జయసూర్యకు ఉంది. కచ్చితంగా స్పిన్నర్ల నుంచే భారత బ్యాటర్లకు అతిపెద్ద సవాల్ ఎదురుకానుంది. ముఖ్యంగా జయసూర్య భారత బ్యాటర్లకు పెద్ద పరీక్షగా మారతాడు. అతడే మా ప్రధాన ఆయుధం. గాలెలో అతడు ఎన్నో వికెట్స్ పడగొట్టాడు. అతడిని కింగ్ ఆఫ్ గాలె’ అని పిలుస్తాం' అని మహరూఫ్ చెప్పాడు.
'గాలె వేదికపై క్రాస్‌విండ్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గాలి దిశను అర్థం చేసుకుని స్పిన్నర్లు బంతిని డ్రిఫ్ట్ చేయగలిగితే బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. భారత స్పిన్నర్లు కూడా అక్కడి పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతారనేది మ్యాచ్‌లో కీలకంగా మారుతుంది. శ్రీలంక పేస్ బౌలింగ్‌లో అసిత ఫెర్నాండో కూడా కీలకంగా మారతాడడు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత్‌కు పెద్ద లోటు. ముఖ్యంగా పాత బంతితో రివర్స్ స్వింగ్ చేయడంలో బుమ్రా సామర్థ్యం అసాధారణం. అతడి గైర్హాజరీతో భారత్ వికెట్లు తీయడంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది' అని మహరూఫ్ తెలిపాడు.
జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో మహ్మద్ సిరాజ్ భారత పేస్ దాడికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. మరోవైపు యువ పేసర్ గుర్నూర్ బ్రార్ టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గత టెస్టులో ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో బ్రార్‌ను తీసుకోవడంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గుర్నూర్ బ్రార్‌పై మహరూఫ్ ప్రశంసలు కురిపించాడు. అతడిలో వేగం, బౌన్స్‌తో పాటు దూకుడైన ఆటతీరు ఉన్నాయని చెప్పాడు. వార్మప్ మ్యాచ్‌లో టెస్టు జట్టులోని పలువురు బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడని, బ్రార్ భారత జట్టుకు ‘ఎక్స్ ఫ్యాక్టర్’గా మారగలడని అభిప్రాయపడ్డాడు.
టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాటింగ్‌కు రవీంద్ర జడేజా కూడా కీలకమవుతాడని మహరూఫ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఏడో స్థానంలో జడేజా బ్యాటింగ్ చేయడం భారత జట్టుకు అదనపు బలమని అన్నాడు. భారత్ బలమైన జట్టే అయినప్పటికీ.. గాలె పరిస్థితులు, ప్రభాత్ జయసూర్య బౌలింగ్, క్రాస్‌విండ్ వంటి అంశాలు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపవచ్చని మహరూఫ్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్ 1-1తో డ్రా అవుతుందని జోస్యం చెప్పాడు. గాలెలో ‘కింగ్ ఆఫ్ గాలె’ జయసూర్యను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నదే ఈ సిరీస్‌లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.




