IND vs SL 1st Test: నేను చెప్పింది వినలేదా.. మంజ్రేకర్‌తో మురళీ వాగ్వాదం.. అసలు ఏం జరిగిందంటే?

IND vs SL 1st Test: నాలుగో రోజు ఆట సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

Rishvik
Published on: 18 Aug 2026 7:00 PM IST
IND vs SL 1st Test
X

IND vs SL 1st Test: నేను చెప్పింది వినలేదా.. మంజ్రేకర్‌తో మురళీ వాగ్వాదం.. అసలు ఏం జరిగిందంటే?

IND vs SL 1st Test: భారత్, శ్రీలంక మధ్య గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ సమయం బ్యాటింగ్ చేసిందా? లేదా వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో మరింత వేగంగా ఇన్నింగ్స్‌ను ముగించాల్సిందా? అనే అంశంపై ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యాయి. సోమవారం మూడో రోజు ఆట ముగిసిన తర్వాత ఈ ఇద్దరు మాజీ భారత క్రికెటర్లు సరదాగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్.. ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ దూకుడుగా ఆడుతూ 69 బంతుల్లో 66 పరుగులు చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో అతడు విరుచుకుపడ్డాడు. దేవదత్ పడిక్కల్ 44, కేఎల్ రాహుల్ 35 పరుగులతో రాణించారు. దీంతో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ అనంతరం మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య చర్చ మొదలైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో భారత్ మరింత ముందుగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో భారత్ పెద్దగా పరుగులు సాధించలేదని పేర్కొన్నాడు.

అయితే సంజయ్ మంజ్రేకర్ మాత్రం మురళీ కార్తీక్ వాదనతో ఏకీభవించలేదు. శ్రీలంకను 80 లేదా 90 ఓవర్లలోపు ఆలౌట్ చేసేంత బలమైన బౌలింగ్ దాడి భారత్ వద్ద ఉందని అభిప్రాయపడ్డాడు. వాతావరణం కారణంగా పూర్తి ఓవర్లు సాధ్యం కాకపోతే మాత్రమే భారత్ ముందుగానే ఇన్నింగ్స్‌ను ముగించి ఉండాల్సిందా? అనే ప్రశ్న తలెత్తుతుందని పేర్కొన్నాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలకు కార్తీక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను చెప్పింది మీరు విన్నారో లేదో తెలియదు. వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు 80 నుంచి 90 ఓవర్లు పడుతాయని మీరు హామీ ఇవ్వగలరా?' అంటూ ప్రశ్నించాడు.

వర్షం కారణంగా ఐదో రోజు ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, అందువల్ల నాలుగో రోజులో భారత్‌కు బౌలింగ్ చేయడానికి వీలైనంత ఎక్కువ సమయం అవసరమని కార్తీక్ వివరించాడు. మ్యాచ్‌లో ప్రతి ఓవర్ కీలకమేనని, చివరి అరగంటలో భారత్ పెద్దగా పరుగులు సాధించకపోయినా.. ఆ సమయం ఉపయోగపడేలా ముందుగానే ఆలోచించాల్సిందని అభిప్రాయపడ్డాడు. కార్తీక్ వాదనకు మంజ్రేకర్ మరోసారి స్పందించాడు. శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌లో పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడంతో భారత్ బౌలర్లు ఈ జట్టును సులభంగా ఆలౌట్ చేయగలరని పేర్కొన్నాడు.

80కి పైగా ఓవర్లు లభించినా శ్రీలంకను ఆలౌట్ చేయలేకపోతే.. అందుకు భారత బ్యాటర్లు ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడమే కారణం కాదని, బౌలింగ్ దాడి సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య జరిగిన ఈ చర్చకు ప్రధాన కారణం గాలెలో నెలకొన్న వాతావరణ పరిస్థితులే. భారత్ శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా.. నాలుగో రోజు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 84/4తో నిలిచింది. శ్రీలంక విజయానికి ఇంకా 288 పరుగులు అవసరం కాగా..భారత్‌కు ఆరు వికెట్లు కావాలి. అయితే చివరి రోజు వర్షం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ ముందుగానే ఇన్నింగ్స్‌ను ముగించి.. బౌలింగ్ చేయాల్సిందని క్రికెట్ అభిమానులు కూడా అంటున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story