IND vs SL 2nd Test: జురెల్ సెంచరీ, పంత్ ఫిఫ్టీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత్.. అప్పుడే 2 వికెట్స్ కోల్పోయిన లంక!
IND vs SL 2nd Test: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసింది.
IND vs SL 2nd Test: జురెల్ సెంచరీ, పంత్ ఫిఫ్టీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత్.. అప్పుడే 2 వికెట్స్ కోల్పోయిన లంక!
IND vs SL 2nd Test: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 300/5 స్కోరుతో ఉన్న టీమిండియా.. రెండో రోజు బ్యాటింగ్‌ను కొనసాగించి 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో మెరవగా.. గాయం కారణంగా తొలి రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి కీలక హాఫ్ సెంచరీ బాదాడు.
ఓవర్‌నైట్ స్కోరు 7 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 177 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో తన బ్యాటింగ్ సత్తాను మరోసారి చాటుకున్న జురెల్.. జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 99 పరుగుల వద్ద ఉన్నపుడు జురెల్ చాలా నెమ్మదిగా ఆడాడు. చాలా బంతులు ఎదుర్కొన్న తర్వాత మూడంకెల స్కోర్ అందుకున్నాడు. దాంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి నెలకొంది. శ్రీలంకలో టెస్టుల్లో 7వ స్థానంలో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.
మరోవైపు తొలి రోజు లహిరు కుమార బౌలింగ్‌లో ఎడమ మణికట్టుకు గాయం కావడంతో 3 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన రిషభ్ పంత్.. రెండో రోజు తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. నొప్పిని ఏమాత్రం లెక్కచేయకుండా ఆడిన పంత్ 89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. మానవ్ సుతార్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో ప్రసిద్ధ్ కృష్ణ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత్ 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య, కేశర నువాంతు చెరో రెండు వికెట్లు తీశారు. ఇక లహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది.
భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సమయానికి కొలంబోలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే తేలికపాటి వర్షం పడింది. అంపైర్లు ఆటను నిలిపివేయడంతో మైదానంలో సిబ్బంది కవర్లు కప్పారు. వర్షం ఆగిన అనంతరం కవర్లను తొలగించి సాయంత్రం 5:35 గంటలకు ఆటను తిరిగి ప్రారంభించారు. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. లహిరు ఉదారాను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. థర్డ్ స్లిప్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఉదారా కేవలం 6 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. లంకకు మూడో ఓవర్లో మరో షాక్ తగిలింది. ప్రబాత్ జయసూర్యను మానవ్ సుతార్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ వెంటనే రెండో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి లంక రెండు వికెట్ల నష్టానికి 8 రన్స్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో లంక ఇంకా 495 రన్స్ వెనకబడి ఉంది.




