IND vs SL 2nd Test: ముగిసిన మూడో రోజు ఆట.. శ్రీలంకకు 39 పరుగులు.. టీమిండియాకు 2 వికెట్లే!
IND vs SL 2nd Test Day 3: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది.
IND vs SL 2nd Test: ముగిసిన మూడో రోజు ఆట.. శ్రీలంకకు 39 పరుగులు.. టీమిండియాకు 2 వికెట్లే!
IND vs SL 2nd Test: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది. చివరి గంటలో వర్షం కురవడంతో.. 83.4 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 265/8 పరుగులు చేసింది. క్రీజులో లాహిరు కుమార (8), సోనల్ దినుషా (85) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్ చేసిన నేపథ్యంలో శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది.
మూడో రోజు ఆరంభం నుంచే శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించారు. భారత్ వరుసగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచింది. ఒక దశలో శ్రీలంక 173/7తో కష్టాల్లో పడింది. దీంతో మూడో రోజే భారత జట్టు శ్రీలంకను ఆలౌట్ చేసి ఫాలోఆన్ ఆడించేలా కనిపించింది. అయితే పసిండు సూరియబండారా, సోనల్ దినుషా పోరాటంతో శ్రీలంక ఇన్నింగ్స్ గాడిన పడింది.
రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్న పసిండు సూరియబండారా అద్భుతమైన బ్యాటింగ్‌తో 80 పరుగులు చేశాడు. కీలక సమయంలో వికెట్ కాపాడుకుంటూ భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. అతడు ఔటైన తర్వాత కూడా సోనల్ దినుషా మరోసారి తన ప్రతిభను చూపించాడు. ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో, అంతర్జాతీయ స్థాయిలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న దినుషా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.
సోనల్ దినుషాకు కేశర నువాంత, లహిరు కుమార నుంచి మంచి సహకారం లభించింది. దినుషా, నువాంత జోడీ భారత బౌలర్లను కొంతసేపు సమర్థంగా అడ్డుకుంది. దీంతో శ్రీలంక మూడో రోజు చివరి వరకు వికెట్లు కాపాడుకోగలిగింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు తీసి సత్తా చాటారు.
ప్రసిద్ధ్ తన పేస్‌తో శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టగా.. ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ సాధించారు. అయినప్పటికీ దినుషా పోరాటంతో భారత్‌కు శ్రీలంకను ఆలౌట్ చేసే అవకాశం దక్కలేదు.
84వ ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేయడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. మైదాన సిబ్బంది వెంటనే పిచ్‌తో పాటు అవుట్‌ఫీల్డ్‌ను కవర్లతో కప్పేశారు. వర్షం కొనసాగడంతో ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోయింది.
దీంతో 83.4 ఓవర్ల వద్ద మూడో రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. శ్రీలంక ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 39 పరుగులు చేయాల్సి ఉంది. మరోవైపు భారత్‌కు ఫాలోఆన్ విధించే అవకాశం రావాలంటే మిగిలిన రెండు వికెట్లు త్వరగా పడగొట్టడంతో పాటు భారీ ఆధిక్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
ధ్రువ్ జురెల్ 115 పరుగులు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్ చేసింది. ఇప్పుడు శ్రీలంక 265/8 వద్ద నిలవడంతో నాలుగో రోజు ఆట మరింత కీలకంగా మారింది. మిగిలిన రెండు వికెట్లను భారత్ ఎంత త్వరగా పడగొడుతుంది?.. సోనల్ దినుషా తన 85 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎంత దూరం తీసుకెళ్తాడు?
అనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 38 పరుగుల లోపు లంకను ఆలౌట్ చేస్తే.. ఫాలోఆన్ ఆడించొచ్చు. అప్పుడు లంక రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి వస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో లంక వికెట్స్ త్వరత్వరగా తీస్తే.. కొలంబో టెస్ట్ కూడా భారత్ సొంతమవుతుంది.




