IND vs SL 2nd Test: చరిత్ర సృష్టించిన దేవదత్ పడిక్కల్.. శ్రీలంక గడ్డపై అరుదైన ప్రపంచ రికార్డు!
IND vs SL 2nd Test: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మరోసారి సత్తా చాటాడు. వరుసగా రెండో టెస్టు శతకాన్ని నమోదు చేసి అదరగొట్టాడు.
IND vs SL 2nd Test: చరిత్ర సృష్టించిన దేవదత్ పడిక్కల్.. శ్రీలంక గడ్డపై అరుదైన ప్రపంచ రికార్డు!
IND vs SL 2nd Test: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మరోసారి సత్తా చాటాడు. వరుసగా రెండో టెస్టు శతకాన్ని నమోదు చేసి అదరగొట్టాడు. కొలంబో వేదికగా ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టులో 193 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో పడిక్కల్ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్‌లో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేసిన విదేశీ ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరిట ఉండేది. 1998లో రెండు టెస్టుల సిరీస్‌లో ఫ్లెమింగ్ 307 పరుగులు చేశాడు. ప్రస్తుత సిరీస్‌లో పడిక్కల్ రెండు శతకాలతో ఇప్పటికే 328 పరుగులు సాధించి.. ఆ రికార్డును అధిగమించాడు. అంతేకాదు శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్‌లో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఒక విదేశీ జట్టు తరఫున రెండు శతకాలు సాధించిన తొలి బ్యాటర్‌గా కూడా పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రదర్శనతో టెస్టు క్రికెట్‌లో తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.
దేవదత్ పడిక్కల్ మరో అరుదైన భారత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. రెండు టెస్టుల విదేశీ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. 1998-99లో న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టుల్లో ద్రవిడ్ 321 పరుగులు చేశాడు. ప్రస్తుత సిరీస్‌లో 328 పరుగులు సాధించిన పడిక్కల్.. 27 ఏళ్ల నాటి ద్రవిడ్ రికార్డును అధిగమించాడు. శ్రీలంకపై విదేశీ గడ్డలో ఒక సిరీస్‌లో రెండు శతకాలు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలోనూ పడిక్కల్ చేరాడు. అతడి కంటే ముందు వినోద్ కాంబ్లీ, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్, ఛెతేశ్వర్ పుజారా ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో పడిక్కల్ ఏడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. పడిక్కల్ 117 పరుగులతో కీలక పాత్ర పోషించగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 50 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 45, రవీంద్ర జడేజా 43 పరుగులతో చేశారు. ధ్రువ్ జురెల్ 7, సారంశ్ జైన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. పడిక్కల్, గిల్ కలిసి మూడో వికెట్‌కు 120 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ విరామానికి ముందు 187/3 వద్ద గిల్ 108 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో గిల్ వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఎండ్‌లో పడిక్కల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ తన రెండో వరుస టెస్టు శతకాన్ని పూర్తి చేశాడు.
శ్రీలంక గడ్డపై వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్న దేవదత్ పడిక్కల్.. ఈ సిరీస్‌లో టీమిండియాకు కీలక బ్యాటర్‌గా మారాడు. రెండు టెస్టుల్లోనూ శతకాలతో మెరిసిన అతడు.. తనపై ఉన్న అంచనాలను అందుకోవడమే కాకుండా భారత టెస్టు క్రికెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాడు. ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్ గాయం కారణంగా పడిక్కల్ టీమిండియా జట్టులో చోటు యన దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని టీంఇండియాలో తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నాడు. సాయి సుదర్శన్ పరిస్థితి ఏంటో చూడాలి మరి.




