IND vs SL 2nd Test: భారత్ తుది జట్టులో కీలక మార్పు.. స్టార్ ప్లేయర్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్ అరంగేట్రం!

Saransh Jain India Debut. 33 ఏళ్ల దేశవాళీ కింగ్, ఆల్‌రౌండర్ సారంశ్ జైన్‌ భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Rishvik
Published on: 20 Aug 2026 6:25 PM IST
IND vs SL 2nd Test
X

IND vs SL 2nd Test: భారత్ తుది జట్టులో కీలక మార్పు.. స్టార్ ప్లేయర్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్ అరంగేట్రం!

IND vs SL 2nd Test: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. గాలెలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ విజయం సాధించిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టెస్టులో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో చెలరేగి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో టెస్టులో కూడా అతడు కొనసాగనున్నాడు. అయితే రెండో టెస్టు తుది జట్టులో కీలక మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది.

33 ఏళ్ల దేశవాళీ కింగ్, ఆల్‌రౌండర్ సారంశ్ జైన్‌ భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు దేశవాళీ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న సారంశ్‌కు శ్రీలంక టెస్టు సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కింది. టీమిండియాలో అతడికి ఛాన్స్ రావడం ఇదే మొదటిసారి. గాయంతో అందుబాటులో లేని వాషింగ్టన్ సుందర్ స్థానంలో బీసీసీఐ సెలెక్టర్లు సారంశ్‌కు అవకాశం ఇచ్చారు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న రెండో టెస్టులో సారంశ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ప్లేయింగ్ 11లోకి రానున్నట్లు తెలుస్తోంది.

గాలె టెస్టులో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. అతడు 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి.. కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో రెండో టెస్టులో జట్టు కూర్పును మార్చాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో సారంశ్ జైన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నారట. ఇదే నిజమైతే 33 ఏళ్ల సారంశ్ ఓ రికార్డు నెలకొల్పనున్నాడు. లేటు వయసులో అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నిలవనున్నాడు.

సారంశ్ జైన్‌కు భారత జట్టులో చోటు దక్కడం వెనుక పెద్ద స్టోరీ, సుదీర్ఘ నిరీక్షణ ఉంది. 2014 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు.. దాదాపు 12 ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించాడు. ఎట్టకేలకు ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. రైట్ ఆర్మ్ ఆఫ్‌స్పిన్నర్ అయిన సారంశ్.. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించగలడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా కీలక పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉంది. మధ్యప్రదేశ్‌తో పాటు సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు కూడా అతడు ప్రాతినిధ్యం వహించాడు.

దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సారంశ్ జైన్‌ ఇప్పటివరకు 181 వికెట్లు, 2223 పరుగులు చేశాడు. ఒక దశలో జట్టులో ఎప్పుడో ఓసారి మాత్రమే కనిపించే ఆటగాడిగా ఉన్న అతడు.. కోచ్ చంద్రకాంత్ పండిట్ మార్గదర్శకత్వంలో తన ఆటను మెరుగుపరుచుకుని కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. సారంశ్ కుటుంబానికి కూడా క్రికెట్‌తో అనుబంధం ఉంది. అతడి తండ్రి సుబోధ్ జైన్ కూడా ఆఫ్‌స్పిన్నర్‌గా మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడారు.

అయితే ఆయనకు మాత్రం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు సారంశ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడంతో.. కుటుంబంలో సంతోషం విరాజిల్లింది. తొలి టెస్టులో మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. రెండో టెస్టులోనూ స్పిన్ విభాగం కీలకం కానుంది. జైన్‌కు తుది జట్టులో అవకాశం లభిస్తే.. దాదాపు 12 ఏళ్ల దేశవాళీ ప్రయాణం తర్వాత భారత టెస్టు జెర్సీ ధరించే అరుదైన అవకాశం అతడి సొంతమవుతుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story