IND vs ZIM 1st T20: భయపడకండి, నేనున్నాను.. టీమిండియా ఆటగాళ్లకు శ్రేయస్ బిగ్ మెసేజ్!

IND vs ZIM 1st T20: Shreyas Iyer Sends Big Message To Players. మొదటి టీ20 మ్యాచ్ ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆటగాళ్లకు ధైర్యం చెప్పాడు.

Rishvik
Published on: 22 July 2026 7:15 PM IST
IND vs ZIM 1st T20
X

IND vs ZIM 1st T20: భయపడకండి, నేనున్నాను.. టీమిండియా ఆటగాళ్లకు శ్రేయస్ బిగ్ మెసేజ్!

IND vs ZIM 1st T20: జులై 23 నుంచి జింబాబ్వే, భారత్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ ఆరంభం కానుంది. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేక తీవ్ర నిరాశ ఎదుర్కొన్న టీమిండియా.. జింబాబ్వేపై అయినా గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆటగాళ్లకు ధైర్యం చెప్పాడు. గత ఫలితాల గురించి ఆలోచించకుండా.. భయపడకుండా ఆడాలని తన సహచర ఆటగాళ్లకు పిలుపునిచ్చాడు. వరుస పరాజయాల కారణంగా జట్టుపై విమర్శలు వచ్చినప్పటికీ.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఇటీవల ఎదురైన ఓటములు జట్టును మరింత ఐక్యంగా మార్చాయని, భవిష్యత్తులో మెరుగైన ఫలితాల కోసం అందరూ కలిసి పనిచేస్తున్నామని శ్రేయస్ తెలిపాడు.

ఐర్లాండ్ పర్యటనకు ముందు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత ఇదే తొలి విదేశీ పర్యటన. ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లలో భారత్ విజయాన్ని నమోదు చేయలేకపోయినా.. ఆ పర్యటనల నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నామని శ్రేయస్ అన్నాడు. 'ఇంగ్లండ్‌లో మాకు కఠినమైన దశ ఎదురైంది. కానీ ఆ సిరీస్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు కూడా బయటకు వచ్చాయి. జట్టుగా ఇంకా ఏ విషయాల్లో మెరుగుపడాలో, మైదానంలో పరిస్థితులకు ఎలా త్వరగా అలవాటు పడాలో మాకు ఓ స్పష్టత వచ్చింది. ఇప్పుడు వాటిపైనే దృష్టి పెట్టాం' అని శ్రేయస్ పేర్కొన్నాడు.

'చాలామంది ఆటగాళ్లు తొలిసారి జింబాబ్వేలో ఆడుతున్నారు. ఇక్కడి పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లండ్ నుంచి నేరుగా జింబాబ్వేకు రావడంతో కేవలం ఒకే రోజు ప్రాక్టీస్ చేసే అవకాశం లభించింది. అయినప్పటికీ ఇలాంటి సవాళ్లే ఆటగాళ్లను మరింత మెరుగుపరుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ప్రదర్శన చేస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. సవాళ్లను స్వీకరించడం కూడా క్రికెట్‌లో భాగమే. యువ ప్లేయర్స్ వైఫల్యానికి భయపడొద్దు. అలాంటి భయం ఉంటే మన సహజమైన ఆటను ప్రదర్శించలేం. ఎవరేమంటున్నారో ఆలోచించకుండా ప్రస్తుతం చేయాల్సిన పనిపైనే దృష్టి పెట్టాలి. జట్టుగా కలిసి మంచి క్రికెట్ ఆడితే ఫలితాలు తప్పకుండా వస్తాయి' అని సహచరులకు శ్రేయస్ సూచించాడు.

15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై కూడా శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. 'వైభవ్ ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పుడు తన తప్పులను సరిదిద్దుకుని మరింత మెరుగ్గా సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత అతడికి మంచి విరామం లభించింది. ఆ సమయంలో తన ఆటలోని లోపాలను సరిచేసుకున్నాడు. అతడికి ప్రత్యేకంగా నేను సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతడు తన తప్పులను అర్థం చేసుకుని తిరిగి బలంగా వస్తాడని నమ్ముతున్నాను' అని తెలిపాడు. జింబాబ్వేపై బుడ్డోడు ఆడడం ఖాయం.

జింబాబ్వే జట్టును తేలికగా తీసుకునే పరిస్థితి లేదని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. 'జింబాబ్వే మంచి జట్టు ఉంది. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా టీంలో ఉన్నారు. అందుకే వారిని తక్కువ అంచనా వేయకూడదు' అని చెప్పాడు. గాయం నుంచి తిరిగి రావడం తనను మానసికంగా మరింత బలంగా మార్చిందని చెప్పిన అయ్యర్.. కష్టాలను ఎంత త్వరగా అధిగమిస్తే అంత మంచి ఆటగాడిగా ఎదుగుతామని చెప్పాడు. జింబాబ్వే సిరీస్‌తో విజయాల బాట పట్టి కొత్త ఆరంభం చేయాలని శ్రేయస్ చూస్తున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story