India A Final: డు ఆర్ డై మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు భారత్!
India A Reach Tri-Series Final: అఫ్గానిస్థాన్-ఎతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టు 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
India A Final: డు ఆర్ డై మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు భారత్!
India A Final: ట్రై నేషన్ వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-ఎతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టు 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ‘డు ఆర్ డై’గా మారిన ఈ పోరులో అన్ని విభాగాల్లోనూ రాణించిన యువ భారత్.. ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇప్పుడు అఫ్గానిస్థాన్-ఎ, శ్రీలంక-ఎ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేత.. తుది పోరులో ఇండియా-ఎను ఢీకొట్టనుంది.
ప్రియాంశ్, తిలక్ ఫిఫ్టీస్:
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (59) ఆడాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 58 పరుగులతో శుభారంభం అందించగా.. కుమార్ కుషాంగ్రా కూడా 58 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 38 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
ఆరంభంలోనే డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడిన అతడికి థర్డ్ అంపైర్ నిర్ణయంతో లైఫ్ లభించింది. రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేయగా.. చివర్లో విప్రాజ్ నిగమ్ (30), నిషాంత్ సింధు (21 నాటౌట్) వేగంగా పరుగులు చేసి జట్టు స్కోరును 300 దాటించారు. అఫ్గానిస్థాన్-ఎ బౌలర్లలో ఫరిదూన్ దావూద్జాయ్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, ఫర్మనుల్లా సఫీ తలో రెండు వికెట్లు తీశారు.
చెలరేగిన సింధు:
320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్-ఎ జట్టు భారత బౌలర్ల దాడికి 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. బాహిర్ షా 57 పరుగులతో పోరాడగా.. ఫైసల్ షినోజాదా 46, కెప్టెన్ ఇమ్రాన్ మీర్ 32 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
భారత్-ఎ బౌలర్లలో నిషాంత్ సింధు అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. యశ్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. అంశుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్ షెడ్జే, అనుకుల్ రాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ప్రత్యర్థి ఎవరు:
వరుసగా రెండు పరాజయాలతో ఇండియా-ఎ వెనకపడిపోయింది. వర్షం కారణంగా అఫ్గానిస్థాన్ గెలవగా.. సూపర్ ఓవర్లో శ్రీలంక విజయాన్ని అందుకుంది. దాంతో భారత్ ఫైనల్ బెర్త్ సంక్లిష్టంలో పడింది. అయితే అన్ని విభాగాల్లో చెలరేగిన యువ భారత్.. అఫ్గానిస్థాన్-ఎపై అద్భుత విజయం సాధించింది.
ఈ విజయంతో ఇండియా-ఎ పాయింట్ల పట్టికలో ఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సమిష్టి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మ సేన.. టైటిల్ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. ఫైనల్‌లో శ్రీలంక-ఎ లేదా అఫ్గానిస్థాన్-ఎలో ఎవరు ప్రత్యర్థిగా నిలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




