India A vs Sri Lanka A: రుతురాజ్ సెంచరీ, బౌలర్ల పోరాటం.. శ్రీలంకపై భారత్‌ థ్రిల్లింగ్ విక్టరీ!

India A to Thrilling 8-Run Victory. శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భారత్‌-ఏ జట్టు శుభారంభం చేసింది.

Rishvik
Published on: 9 Jun 2026 7:31 PM IST
India A vs Sri Lanka A: రుతురాజ్ సెంచరీ, బౌలర్ల పోరాటం.. శ్రీలంకపై భారత్‌ థ్రిల్లింగ్ విక్టరీ!
X

India A vs Sri Lanka A: శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భారత్‌-ఏ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఏపై 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సహన్ అరచ్చిగే (74) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అనుకుల్ రాయ్, బదోని, విప్రాజ్ నిగమ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌-ఏకు తొలి ఓవర్లలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. అయితే ప్రియాంశ్ ఆర్య (32)తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అనంతరం కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. రుతురాజ్-తిలక్ జోడీ నాలుగో వికెట్‌కు 150 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును బలమైన స్థితిలో నిలిపింది.

సీనియర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరోసారి తన క్లాస్‌ను చూపాడు. 114 బంతుల్లో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు తిలక్ వర్మ 97 బంతుల్లో 60 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ఆయుష్ బదోని (24), సూర్యాంశ్ షెడ్గే (26) వేగంగా ఆడడంతో భారత్‌-ఏ 277 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్‌ షిరాజ్‌ 2 వికెట్స్ తీయగా.. చమిక కరుణ రత్నే, వనుజ సహాన్‌, గరుక సంకేత్ తలో వికెట్‌ పడగొట్టారు.

278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఏకు ఓపెనర్లు నీరోషన్ డిక్వెల్లా (47), అవిష్క ఫెర్నాండో (45) మంచి ఆరంభం అందించారు. ఆ తర్వాత సదీర సమరవిక్రమ (46), కెప్టెన్ సహన్ అరచ్చిగే (74) అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను శ్రీలంక వైపు మళ్లించారు. ముఖ్యంగా అరచ్చిగే 72 బంతుల్లో 74 పరుగులు చేసి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివర్లో వనుజ సహన్ (23) ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరలో భారత బౌలర్లు చెలరేగడంతో లంక వరుసగా వికెట్స్ కోల్పోయింది. భారత్‌-ఏ బౌలర్లు సమిష్టిగా రాణించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్‌-ఏ బౌలర్లు ఒత్తిడిని తట్టుకుని శ్రీలంకను 269 పరుగులకే కట్టడి చేసి.. 8 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందించారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story