Team India Coach: టీమిండియాకు మరో షాక్.. కోచ్ రాజీనామా.. కారణం ఇదే!

Ryan ten Doeschate Set to Resign. టీమిండియా కోచింగ్ సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Rishvik
Published on: 14 July 2026 6:49 PM IST
Team India Coach
X

Team India Coach: టీమిండియాకు మరో షాక్.. కోచ్ రాజీనామా.. కారణం ఇదే!

Team India Coach: టీమిండియా కోచింగ్ సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఆయన భారత జట్టుకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో టెన్ డస్కటే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రముఖ క్రీడా ఛానెల్లో కథనాలు వచ్చాయి.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ర్యాన్ టెన్ డస్కటే, బీసీసీఐ మధ్య 2024 జూలైలో ఒప్పందం కుదిరింది. తొలి దశ జూలై 12-14 మధ్య పూర్తయింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పరస్పర అంగీకారంతో విడిపోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తనను బాధ్యతల నుంచి విముక్తి చేయాలని బీసీసీఐకి టెన్ డస్కటే విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అతడు వైదొలగడానికి అసంతృప్తి, ఇటీవల భారత్ టీ20 సిరీస్‌ల్లో ఎదుర్కొన్న పరాజయాలు కారణం కాదని నివేదికలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత కారణాల వల్లే టెన్ డస్కటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత జట్టు కోచింగ్ బాధ్యతల్లో భాగంగా తరచూ పలు దేశాలు, నగరాలకు ప్రయాణాలు చేయాల్సి రావడం వల్ల టెన్ డస్కటే తన కుటుంబానికి సమయం కేటాయించడం కష్టంగా మారిందని సమాచారం. ముగ్గురు చిన్నారులకు తండ్రైన ఆయన ఉద్యోగం చేస్తున్న తన భార్యకు తోడుగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రయాణాలు తక్కువగా ఉండే బాధ్యతలను చేపట్టాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ర్యాన్ టెన్ డస్కటేకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ గతంలో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో టెన్ డస్కటేను కొనసాగించాలని గంభీర్ ప్రయత్నిస్తాడా? లేక అతని నిర్ణయాన్ని గౌరవిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు భారత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ భవిష్యత్తుపైనా సందేహాలు నెలకొన్నాయి. పీటీఐ కథనం ప్రకారం.. ఆయన పదవీకాలాన్ని బీసీసీఐ మరోసారి పొడిగించే అవకాశాలు చాలా తక్కువ. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందంలో కీలక సభ్యుడిగా పనిచేసిన దిలీప్.. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో 'బెస్ట్ ఫీల్డింగ్ మెడల్' సంప్రదాయాన్ని ప్రారంభించి ఆటగాళ్లలో ఉత్సాహాన్ని పెంచాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత మిగతా కోచింగ్ సిబ్బంది తప్పుకున్నప్పటికీ.. గంభీర్ బృందంలో కొనసాగిన ఏకైక సభ్యుడు ఆయనే.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం అనంతరం ఆయన పదవీ కాలాన్ని బీసీసీఐ ఏడాది పొడిగించింది. అయితే ఇటీవల భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోవడంతో బీసీసీఐ అసంతృత్తిగా ఉందట. ఈ నేపథ్యంలోనే దిలీప్ కు మరోసారి అవకాశం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. టెన్ డస్కటే రాజీనామా వార్తలు, దిలీప్ భవిష్యత్తుపై అనిశ్చితి నేపథ్యంలో టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ అంశాలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story