India Jersey Colour: నీలం నుంచి కాషాయం రంగులోకి జెర్సీ.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన హాకీ ఇండియా!

Hockey India clarifies why India's hockey teams will wear saffron jersey. బ్లూ సింథటిక్ మైదానంలో ప్లేయర్స్ బాగా కనిపించడానికే జెర్సీ రంగును మార్చినట్లు హాకీ ఇండియా స్పష్టం చేసింది.

Rishvik
Published on: 30 July 2026 5:52 PM IST
India Jersey Colour
X

India Jersey Colour: నీలం నుంచి కాషాయం రంగులోకి జెర్సీ.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన హాకీ ఇండియా!

India Jersey Colour: మరికొన్ని రోజుల్లో పురుషుల హాకీ ప్రపంచ కప్‌ 2026 జరగనుంది. వచ్చే నెలలో నెదర్లాండ్స్, బెల్జియంలో జరగనున్న 2026 ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచ కప్‌కు ముందు పురుషుల, మహిళల జాతీయ జట్ల జెర్సీ రంగు మారింది. సంప్రదాయ నీలం (బ్లూ) జెర్సీల స్థానంలో కాషాయ (సాఫ్రన్) రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది. భారత హాకీ జట్ల జెర్సీ రంగు మారడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. భారత మాజీ కెప్టెన్ విరెన్ రస్క్వీనా కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విమర్శలపై హాకీ ఇండియా తాజాగా వివరణ ఇచ్చింది. బ్లూ సింథటిక్ మైదానంలో ప్లేయర్స్ బాగా కనిపించడానికే జెర్సీ రంగును మార్చినట్లు హాకీ ఇండియా స్పష్టం చేసింది.

'కోచ్‌లు, ఆటగాళ్లతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. జెర్సీ రంగు మార్పు వెనుక రాజకీయ కారణాలు ఏవీ లేవు. ఓ సాంకేతిక కారణం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లన్నీ నీలం రంగు సింథటిక్ టర్ఫ్‌లపై జరుగుతున్నాయి. బ్లూ జెర్సీలు ధరించడం వల్ల ఆటగాళ్లకు ఒకరినొకరు గుర్తించడం, మైదానంలో స్పష్టతతో ఆడటం కొంత ఇబ్బందిగా మారనుంది. ఈ సాంకేతిక అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ రంగులపై చర్చించాము. ఈ క్రమంలో కోచ్‌లు, ప్లేయర్లు పసుపు లేదా కాషాయం రంగులను సూచించారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కాషాయంను ఫైనల్ చేశాం' అని హాకీ ఇండియా స్పష్టం చేసింది.

జెర్సీ రంగు మార్పు భారత హాకీలో కొత్త విషయం కాదని కూడా హాకీ ఇండియా గుర్తుచేసింది. గతంలో 2014 హాకీ ప్రపంచకప్ సందర్భంగా భారత జట్టు పసుపు రంగు జెర్సీ ధరించగా.. 2018 ప్రపంచకప్‌లో స్కై బ్లూ రంగు జెర్సీతో బరిలోకి దిగిందని తెలిపింది. అవసరాలకు అనుగుణంగా జెర్సీల రూపకల్పన, రంగుల్లో మార్పులు గతంలో కూడా జరిగాయని పేర్కొంటూ.. ఈసారి కూడా పూర్తిగా ఆటగాళ్ల అభిప్రాయాలు, సాంకేతిక అవసరాలు, జాతీయ పతాకంలోని ప్రతీకాత్మక విలువలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కాషాయ జెర్సీని ఎంపిక చేసినట్లు హాకీ ఇండియా స్పష్టం చేసింది.

2014 ప్రపంచ కప్‌ సమయంలో పసుపు రంగులోకి జెర్సీ మారగా.. 2018 వరల్డ్ కప్‌ సమయంలో స్కై బ్లూలోకి మారింది. పురుషుల హాకీ ప్రపంచ కప్‌ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనుంది. పూల్‌ డిలో ఉన్న భారత్.. ఆగస్టు 15న వేల్స్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. 17న ఇంగ్లాండ్‌తో, 19న పాకిస్థాన్‌తో తలపడనుంది. 2023లో జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ 9వ స్థానంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భారత్ ఒక్కసారి మాత్రమే విజేతగా నిలిచింది. 1975లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. తర్వాత ఒక్క పతకం కూడా సాధించలేదు. అంతకుముందు టీమిండియాకు 1973లో రజతం, 1971లో కాంస్యం దక్కాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story