Hockey World Cup 2026: ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించిన భారత్.. 50 ఏళ్ల కరువు తీరేనా?

India has announced squad for the 2026 FIH Hockey World Cup. పురుషుల హాకీ ప్రపంచ కప్‌ 2026 కోసం మంగళవారం 20 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది.

Rishvik
Published on: 21 July 2026 8:21 PM IST
Hockey World Cup 2026
X

Hockey World Cup 2026: ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించిన భారత్.. 50 ఏళ్ల కరువు తీరేనా?

Hockey World Cup 2026: పురుషుల హాకీ ప్రపంచ కప్‌ టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. ప్రపంచ కప్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో మంగళవారం 20 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆగస్టు 15 నుంచి 30 వరకు హాకీ ప్రపంచ కప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

24 మంది సభ్యులున్న ప్రో లీగ్ జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రపంచ కప్‌లో జట్టు పరిమాణంపై ఉన్న పరిమితి కారణంగా.. ఇటీవల లండన్‌ అంచె ప్రొ హాకీ లీగ్‌లో ఆడిన నలుగురు ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు. డిఫెండర్ అమన్‌దీప్ లక్రా, మిడ్‌ఫీల్డర్లు రాజ్ కుమార్ పాల్, రబిచంద్ర సింగ్ మొయిరాంగ్‌థెమ్ సహా ఫార్వర్డ్ సెల్వం కార్తిలకు నిరాశ ఎదురైంది. ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్, పాకిస్తాన్, వేల్స్‌లతో పాటు పూల్ డిలో భారత్‌ ఉంది. భారత్ తన గ్రూప్ మ్యాచ్‌లన్నింటినీ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్వీన్‌లో ఆడనుంది.

భారత్ ఆగస్టు 15న వేల్స్‌తో తమ ప్రపంచ కప్‌ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో, ఆగస్టు 19న పాకిస్థాన్‌తో తలపడుతుంది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాబట్టి ఈసారి కేవలం మెరుగైన ప్రదర్శన చేయడమే కాకుండా.. పతకం గెలిచి స్వర్ణ స్మృతులను తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ చివరిసారిగా 1975లో కౌలాలంపూర్‌లో ప్రపంచ కప్‌ను అందుకుంది. ఆ తర్వాత 1971లో బార్సిలోనాలో కాంస్య పతకాన్ని, 1973లో ఆమ్‌స్టర్‌డామ్‌లో రజత పతకాన్ని సాధించింది. అప్పటి నుంచి ప్రపంచ కప్ వేదికపైకి సత్తాచాటలేదు. భారత్ ప్రపంచ కప్‌ను గెలుచుకుని 50 ఏళ్లు అయింది. ఈసారైనా టైటిల్ కరువు తీరుస్తారో లేదో చూడాలి.

హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా భారత జట్టు ప్రపంచంలోని అగ్రశ్రేణి హాకీ జట్లలో ఒకటిగా నిలదొక్కుకుంది. కానీ ప్రపంచ కప్ వేదిక మాత్రం సత్తా చాటలేకపోయింది. జట్టులో అంతర్జాతీయ క్రికెట్‌లో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ వంటి ఆటగాళ్లు మిడ్‌ఫీల్డ్‌ను బలోపేతం చేస్తారు. మోహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కేరా గోల్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తారు. హర్మన్‌ప్రీత్ రక్షణ విభాగంలో అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్‌దీప్ సివాచ్ ఉన్నారు. ఫార్వర్డ్ లైన్‌లో మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, శిలానంద్ లక్రాలు ఉన్నారు.

భారత జట్టు:

గోల్ కీపర్లు – మోహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కేరా.

డిఫెండర్లు - హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్‌దీప్ సివాచ్.

మిడ్‌ఫీల్డ్ - మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలాగే

ఫార్వర్డ్‌లు – మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, శిలానంద్ లక్రా.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story