న్యూజిలాండ్ టెస్టులకు ఈ ఐదుగురికి షాక్? టీమిండియా నుంచి వేటు తప్పదా?

India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది.

Venkat
Published on: 28 Aug 2026 9:00 PM IST
India vs New Zealand
X

న్యూజిలాండ్ టెస్టులకు ఈ ఐదుగురికి షాక్? టీమిండియా నుంచి వేటు తప్పదా?

India vs New Zealand: శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకున్నా.. టీమిండియా కూర్పుపై చర్చ మొదలైంది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు, నవంబర్ 27న క్రైస్ట్‌చర్చ్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ పరిస్థితులు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భారత్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలంక సిరీస్‌లో ఆడిన కొందరు ఆటగాళ్లకు న్యూజిలాండ్ పర్యటనలో చోటు దక్కకపోవచ్చనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ ఐదుగురి స్థానాలపై సెలెక్టర్లు ఆలోచించే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.

1. యశస్వి జైస్వాల్..

టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు ఈ జాబితాలో ఉండటం ఆశ్చర్యమే. అయితే ఇటీవల అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. శ్రీలంకతో రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన జైస్వాల్ 139 పరుగులు చేశాడు. సగటు 34.75గా ఉంది.

దూకుడైన బ్యాటింగ్ జైస్వాల్ బలం. అయితే అదే శైలి కొన్ని సందర్భాల్లో అతడికి ప్రతికూలంగా మారుతోంది. గాలే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి వికెట్ చేజార్చుకున్నాడు.

మరోవైపు న్యూజిలాండ్‌లో బంతి స్వింగ్ అయ్యే పరిస్థితులు ఉండటంతో ఫుట్‌వర్క్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే జైస్వాల్‌కు చోటు కోల్పోయే పరిస్థితి రావచ్చనే అభిప్రాయం ఉంది.

సాయి సుదర్శన్ ఫిట్‌గా ఉంటే అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు కేఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేయించి, సుదర్శన్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో టాప్ ఆర్డర్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్లేషణ.

2. కుల్దీప్ యాదవ్..

మరో కీలక పేరు కుల్దీప్ యాదవ్. శ్రీలంకతో తొలి టెస్టులో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. అనంతరం ఇన్ఫెక్షన్ కారణంగా కొలంబోలో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సారంశ్ జైన్ తుది జట్టులోకి వచ్చాడు.

న్యూజిలాండ్‌లో పరిస్థితులు స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో వెళ్లాల్సిన అవసరం లేదని టీమ్ మేనేజ్‌మెంట్ భావించవచ్చు.

రవీంద్ర జడేజా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడటం అతడికి అదనపు ప్రయోజనం. మానవ్ సుతార్ కూడా జట్టులో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కుల్దీప్ స్థానంపై ప్రశ్నలు తలెత్తవచ్చు.

3. సర్ఫరాజ్ ఖాన్..

సాయి సుదర్శన్ గాయం కారణంగా శ్రీలంక సిరీస్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కొలంబో టెస్టులో రిషభ్ పంత్ గాయపడిన సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సేవలందించాడు.

సుదర్శన్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే సర్ఫరాజ్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమయ్యే అవకాశం ఉంది. టాప్, మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే పలువురు బ్యాటర్లు ఉండటంతో సెలెక్టర్లు కాంబినేషన్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

4. గుర్నూర్ బ్రార్..

యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు కూడా న్యూజిలాండ్ టూర్‌లో చోటు విషయంలో పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉంటే తిరిగి టెస్టు జట్టులోకి వచ్చే అవకాశముంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా పేస్ విభాగంలో బలమైన పోటీదారులుగా ఉన్నారు. న్యూజిలాండ్ పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉండటంతో అనుభవజ్ఞులైన బౌలర్లకు ప్రాధాన్యం దక్కవచ్చు.

హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకుంటే అతడూ పోటీలోకి వస్తాడు. మరోవైపు ఔకిబ్ నబీని కూడా సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. దీంతో గుర్నూర్‌కు తుది జట్టులోనే కాదు.. స్క్వాడ్‌లో చోటు కోసం కూడా గట్టి పోటీ తప్పదు.

డులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున గుర్నూర్ ప్రదర్శన కూడా కీలకం కానుంది. అక్కడ రాణిస్తే న్యూజిలాండ్ పర్యటనకు తన అవకాశాలను పెంచుకోవచ్చు.

5. సారంశ్ జైన్..

శ్రీలంకతో రెండో టెస్టులో 33 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన సారంశ్ జైన్‌కు కూడా న్యూజిలాండ్‌లో చోటు దక్కడం అంత సులువు కాకపోవచ్చు.

వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడం, కుల్దీప్ యాదవ్ రెండో టెస్టుకు దూరం కావడంతో సారంశ్‌కు అవకాశం లభించింది. అయితే న్యూజిలాండ్ పరిస్థితుల్లో భారత్ పేస్ ఆధారిత బౌలింగ్ దాడితో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో ఆడాలని భారత్ నిర్ణయిస్తే రవీంద్ర జడేజాకే ఎక్కువ ప్రాధాన్యం దక్కవచ్చు. రెండు స్పిన్నర్లతో ఆడితే మాత్రం వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ వంటి ఆటగాళ్ల నుంచి సారంశ్‌కు పోటీ ఎదురవుతుంది.

WTCలో కీలకమైన న్యూజిలాండ్ సిరీస్..

శ్రీలంకతో రెండో టెస్టు డ్రాగా ముగియడంతో భారత్ 1-0తో సిరీస్‌ను గెలుచుకుంది. అయితే WTC పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టులు WTC ఫైనల్ అవకాశాల పరంగా అత్యంత కీలకంగా మారనున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ గడ్డపై అత్యుత్తమ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని టీమిండియా భావించడం ఖాయం. దీంతో శ్రీలంక సిరీస్‌లో కనిపించిన కొందరు ఆటగాళ్లకు చోటు దక్కకపోవచ్చు. అయితే తుది జట్టుపై నిర్ణయం ఆటగాళ్ల ఫిట్‌నెస్, దేశవాళీ ప్రదర్శనలు, న్యూజిలాండ్ పిచ్‌ల పరిస్థితులను బట్టి ఉండనుంది.

మరి న్యూజిలాండ్ టెస్టులకు యశస్వి, కుల్దీప్, సర్ఫరాజ్, గుర్నూర్, సారంశ్‌లలో నిజంగా ఎవరు చోటు కోల్పోతారు? సెలెక్టర్ల తుది నిర్ణయం వరకు ఉత్కంఠ కొనసాగనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story