Commonwealth Games 2026: గుల్వీర్ సింగ్ మెరుపు.. కాంస్యంతో భారత్ పతకాల సంఖ్య 39కి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 39 పతకాలు సాధించింది. గుల్వీర్ సింగ్ కాంస్యం, బాక్సర్లు 7 స్వర్ణాలతో చరిత్ర సృష్టించారు.
Gulveer Singh Bronze Medal
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న పోటీల్లో 10వ రోజు భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 5000 మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ ఉత్కంఠభరిత పోరులో కాంస్య పతకం సాధించాడు.
చివరి క్షణాల్లో అద్భుత ప్రదర్శన చేసిన గుల్వీర్ సింగ్ నాలుగో స్థానం నుంచి పుంజుకుని మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. కేవలం 4 మిల్లీసెకన్ల తేడాతో కెన్యా ఆటగాడిని వెనక్కి నెట్టి పతకం సాధించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో గుల్వీర్ రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.
బాక్సింగ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలిసారి ఏకంగా ఏడు స్వర్ణ పతకాలను సాధించిన భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ప్రీతి పవార్, జైస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ ఘంఘాస్, అరుంధతి చౌదరి, సచిన్ శివాచ్, అంకుష్ పంఘాల్ స్వర్ణాలు సాధించారు.
బాక్సింగ్‌లో జడుమణి సింగ్, లవ్లీనా బోర్గోహెయిన్, నరేందర్ బెర్వాల్ రజత పతకాలు సాధించారు. దీంతో బాక్సింగ్‌లో భారత్‌కు మొత్తం 10 పతకాలు దక్కాయి.
అథ్లెటిక్స్‌లోనూ భారత క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల ఎఫ్57 షాట్‌పుట్ విభాగంలో సోమన్ రాణా స్వర్ణం సాధించగా, శుభం జుయాల్ రజతం గెలిచాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజతం, సెల్వ ప్రభు తిరుమారన్ కాంస్యం సాధించారు.
జూడో విభాగంలో ఉన్నతి శర్మ కాంస్య పతకం సాధించింది. మరోవైపు లాన్ బౌల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో నయన్మోని సైకియా ఓటమితో ఈసారి భారత్‌కు ఆ విభాగంలో పతకం దక్కలేదు.




