భారత్‌ టీ20 స్వ్కాడ్ లో ఆ ఫ్రాంచైజీలదే హవా? ఆ రెండు టీంల నుంచి ఒక్కరూ లేరు!

India T20 Squad 2026: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Venkat
Published on: 2 Sept 2026 10:10 PM IST
India T20 Squad 2026
X

భారత్‌ టీ20 స్వ్కాడ్ లో ఆ ఫ్రాంచైజీలదే హవా? ఆ రెండు టీంల నుంచి ఒక్కరూ లేరు!

India T20 Squad 2026: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టులో ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇందులో పంజాబ్‌ కింగ్స్‌ నుంచి అత్యధికంగా ముగ్గురు ఎంపిక కాగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ఒక్క ఆటగాడికీ చోటు దక్కలేదు.

పంజాబ్‌ కింగ్స్‌ – 3

శ్రేయస్‌ అయ్యర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి భారత జట్టులో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రేయస్‌ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. అర్ష్‌దీప్‌ మరోసారి టీ20 జట్టులోకి వచ్చాడు. నితీశ్‌ ఎంపికైనప్పటికీ అతడి ఫిట్‌నెస్‌కు బీసీసీఐ అనుమతి అవసరం.

ముంబయి ఇండియన్స్‌ – 2..

భారత టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ముంబయి ఇండియన్స్‌ నుంచి ఎంపికయ్యారు. బుమ్రా కూడా ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ పొందాల్సి ఉంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ – 2..

టీ20ల్లో దూకుడైన ఓపెనర్‌గా గుర్తింపు పొందిన అభిషేక్‌ శర్మ, వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి జాతీయ జట్టులో ఉన్నారు.

రాజస్థాన్‌ రాయల్స్‌ – 2..

సంజూ శాంసన్‌, వైభవ్‌ సూర్యవంశీ రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి చోటు దక్కించుకున్నారు. జింబాబ్వే పర్యటనకు దూరమైన సంజూ తిరిగి రావడం విశేషం. మరోవైపు యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ – 2..

మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, పేసర్‌ హర్షిత్‌ రాణా కేకేఆర్‌ నుంచి ఎంపికయ్యారు. హర్షిత్‌ కూడా ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ కోసం ఎదురుచూడాల్సి ఉంది.

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ – 2

ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్, లెగ్‌స్పిన్నర్‌ రవీ బిష్ణోయ్‌ ఎల్‌ఎస్‌జీ నుంచి భారత జట్టులోకి వచ్చారు. వాషింగ్టన్‌ సుందర్‌ ఎంపిక కూడా ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ – 1..

అక్షర్‌ పటేల్‌ ఒక్కరే ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. హార్దిక్‌ పాండ్యా అందుబాటులో లేని పరిస్థితుల్లో అక్షర్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం జట్టుకు కీలకం కానుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ – 1..

సీఎస్‌కే నుంచి భారత జట్టులో ఉన్న ఏకైక ఆటగాడు శివమ్‌ దూబె. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడగల సామర్థ్యం అతడికి అదనపు బలం.

ఆ రెండు జట్ల నుంచి ఒక్కరూ లేరు!

ఐపీఎల్‌లో భారీ అభిమానగణం ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్‌ టైటాన్స్‌ (జీటీ)కు ఈసారి నిరాశే ఎదురైంది. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 15 మంది భారత జట్టులో ఈ రెండు ఫ్రాంచైజీల నుంచి ఒక్క ఆటగాడికీ చోటు దక్కలేదు.

భారత్‌ టీ20 జట్టు..

శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబె, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, రవీ బిష్ణోయ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా.

కాగా బుమ్రా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణాల తుది భాగస్వామ్యం ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20లు సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో దిల్లీలో జరగనున్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story