India 600th Test: తొలి మ్యాచ్‌ నుంచి 600వ టెస్టు వరకు.. పురోగతి, పోరాటాలు, చారిత్రాత్మక విజయాలు.. టీమిండియా ప్రస్థానం ఇదే!

భారత క్రికెట్‌ చరిత్రలో మరో అధ్యాయం నమోదైంది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు టీమిండియాకు 600వ టెస్టు మ్యాచ్‌.

Rishvik
Published on: 19 Aug 2026 6:03 PM IST
India 600th Test
X

India 600th Test: తొలి మ్యాచ్‌ నుంచి 600వ టెస్టు వరకు.. పురోగతి, పోరాటాలు, చారిత్రాత్మక విజయాలు.. టీమిండియా ప్రస్థానం ఇదే!

India 600th Test: భారత క్రికెట్‌ చరిత్రలో మరో అధ్యాయం నమోదైంది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు టీమిండియాకు 600వ టెస్టు మ్యాచ్‌. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీ (167), యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టడంతో భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 600వ టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. 1932లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భారత్.. 2026లో 600 టెస్టుల మైలురాయిని అందుకుంది. ఇన్నేళ్లలో భారత్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తొలినాళ్లలో విజయాల కంటే ఓటములు, డ్రాలే ఎక్కువగా ఉండేవి. అయితే కాలక్రమేణా భారత క్రికెట్‌లో వచ్చిన మార్పులు, దిగ్గజ ఆటగాళ్ల రాక, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఫిట్‌నెస్‌పై దృష్టి, ప్రపంచస్థాయి బౌలింగ్‌ కారణంగా టీమిండియా టెస్టు క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టుగా ఎదిగింది.

తొలి 100 టెస్టుల్లో 10 విజయాలే:

భారత్ ఆడిన తొలి 100 టెస్టుల్లో కేవలం 10 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 40 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదుర్కోగా.. 50 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ దశలో భారత్‌ విజయాల కంటే డ్రాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఈ సమయంలో భారత జట్టు ప్రధానంగా స్పిన్ బౌలింగ్‌పైనే ఆధారపడేది. 101 నుంచి 200వ టెస్టు వరకు భారత జట్టు ప్రదర్శనలో కొంత మెరుగుదల వచ్చింది. ఈ 100 మ్యాచ్‌ల్లో భారత్ 25 విజయాలు సాధించగా.. 32 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో 43 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో జట్టు విజయాల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమైంది.

200 నుంచి 300 టెస్టుల మధ్య కూడా పోరాటమే:

201 నుంచి 300వ టెస్టు వరకు భారత్ 21 విజయాలు సాధించింది. 26 ఓటములు, 52 డ్రాలు నమోదయ్యాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ దశలో భారత జట్టులో స్పిన్ ఆధిపత్యం కొనసాగింది. బిషన్ సింగ్ బేడీ, ఎరపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, శ్రీనివాస్ వెంకటరాఘవన్ వంటి స్పిన్నర్లు భారత బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచారు. అయితే 300వ టెస్టు తర్వాత భారత టెస్టు ప్రయాణంలో గణనీయమైన మార్పు వచ్చింది. 301 నుంచి 400వ టెస్టు వరకు భారత్ 32 విజయాలు సాధించగా.. 31 ఓటములు ఎదుర్కొంది. 37 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

400 నుంచి 600 వరకు తిరుగులేని ప్రస్థానం:

401 నుంచి 500వ టెస్టు మధ్య భారత్ ఏకంగా 42 విజయాలు సాధించింది. ఏ సమయంలో 28 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. మరో 30 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విజయాల-ఓటముల నిష్పత్తి 1.5కి చేరింది. 501 నుంచి 600వ టెస్టు వరకు భారత జట్టు మరింత దూకుడుగా ఆడింది. ఈ 100 మ్యాచ్‌ల్లో 57 విజయాలు సాధించి.. 31 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విజయాల-ఓటముల నిష్పత్తి ఏకంగా 1.83కి చేరింది.

43 శాతానికి పైగా విజయాల శాతం:

అంటే తొలి 300 టెస్టుల్లో భారత్ కేవలం 56 విజయాలు మాత్రమే సాధించి 98 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 145 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కానీ 301 నుంచి 600వ టెస్టు వరకు భారత్ 131 విజయాలు నమోదు చేసింది. ఈ కాలంలో 90 ఓటములు, 69 డ్రాలు నమోదయ్యాయి. భారత జట్టు విజయాల శాతం కూడా 43 శాతానికి పైగా పెరిగింది.

సౌరవ్, ధోనీ, కోహ్లీ.. టెస్టు క్రికెట్‌లో విప్లవం:

21వ శతాబ్దంలో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ నాయకత్వం భారత టెస్టు క్రికెట్‌ను విభిన్న దశల్లో ముందుకు తీసుకెళ్లింది. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం, విదేశీ గడ్డపై గెలవాలనే ధైర్యాన్ని పెంచడం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, అత్యుత్తమ పేస్ బౌలింగ్ దళాన్ని తయారు చేయడం వంటి మార్పులు భారత జట్టు విజయాల్లో కీలకంగా మారాయి. ముఖ్యంగా కోహ్లీ నాయకత్వంలో భారత టెస్టు జట్టు ఫిట్‌నెస్‌, పేస్ బౌలింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ వంటి పేసర్లు ప్రపంచ స్థాయిలో భారత బౌలింగ్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.

గవాస్కర్ నుంచి కోహ్లీ వరకు పరుగుల వీరులు:

బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ భారత్ ఎన్నో దిగ్గజాలను ప్రపంచానికి అందించింది. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్లు టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. విదేశీ పరిస్థితుల్లోనూ భారీ స్కోర్లు సాధించే స్థాయికి భారత బ్యాటింగ్ బలం పెరిగింది. 21వ శతాబ్దంలో భారత్ 270 టెస్టులు ఆడి 126 విజయాలు సాధించింది. 79 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 65 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ కాలంలో విజయాల శాతం 46కి పైగా ఉంది. విదేశీ గడ్డపై 146 టెస్టులు ఆడి 51 విజయాలు సాధించింది. 59 ఓటములు, 36 డ్రాలు నమోదయ్యాయి.

విరాట్ కోహ్లీ నాయకత్వంలో చారిత్రాత్మక విజయాలు:

భారత టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 68 టెస్టులకు నాయకత్వం వహించిన కోహ్లీ 40 విజయాలు అందించాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో ఎంఎస్ ధోనీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. ఆ తర్వాత భారత టెస్టు జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడు. 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ను గెలిచిన సారథిగా నిలిచాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి SENA దేశాల్లో ఆసియా కెప్టెన్‌గా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రికార్డు కూడా అతడి ఖాతాలో ఉంది. భారత్ టెస్ట్ ప్రయాణం ఇంకా సజావుగా సాగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story