IND vs ENG : టీ20 పరాజయం తర్వాత వన్డేలపై టీమిండియా కన్ను.. రేపటి నుంచే ఇంగ్లండ్‌తో అసలైన సమరం
IND vs ENG : భారత్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 14 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతున్నారు.
IND vs ENG
IND vs ENG : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు టీ20 సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ సిరీస్ ముగియడంతో టీమిండియా ఇప్పుడు తన పూర్తి దృష్టిని వన్డే సిరీస్‌పై కేంద్రీకరించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూలై 14 నుంచి జూలై 19 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఈ యూకే టూర్‌లో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో, రాబోయే వన్డే సిరీస్‌లో ఎలాగైనా గెలిచి జట్టు పరువు కాపాడాల్సిన భారీ బాధ్యత సీనియర్ ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై పడింది.
ఈ వన్డే సిరీస్‌లో ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపైనే అందరి కళ్లు నిలిచాయి. ఎందుకంటే వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. ఇంగ్లండ్‌లోని పిచ్‌లు వేగవంతమైన బౌన్స్, స్వింగ్‌కు ప్రసిద్ధి. అక్కడ ఎంతటి దిగ్గజ బ్యాటర్లయినా ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి ఇబ్బంది పడుతుంటారు. అయితే, రోహిత్, విరాట్ ప్రపంచ క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు కావడంతో, గతంలో వారు ఇంగ్లండ్ బౌలర్లను వారి సొంత గడ్డపైనే సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. దీంతో ఈసారి కూడా వారి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌లను ఆశిస్తున్నారు.
వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ పిచ్‌లపై రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది. అక్కడ ఆయన ఇంగ్లీష్ బౌలర్లను ఉతికేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇంగ్లండ్ గడ్డపై రోహిత్ శర్మ ఇప్పటివరకు 27 వన్డే మ్యాచ్‌లు ఆడి, 64.91 కళ్లు చెదిరే సగటుతో ఏకంగా 1,428 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ దేశంలో ఒక విదేశీ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉండటం విశేషం. ఆంగ్లేయుల పరిస్థితుల్లో హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 7 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాది రారాజుగా నిలిచారు.
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లండ్ వేదికగా అద్భుతమైన గణాంకాలను కలిగి ఉన్నారు. ఇంగ్లండ్ పిచ్‌లపై విరాట్ కోహ్లీ వన్డే సగటు 51.88 గా ఉంది. ఆయన అక్కడ ఆడిన 33 వన్డే మ్యాచుల్లో 1,349 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన విదేశీ బ్యాటర్ల జాబితాలో రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీనే రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ కన్వర్షన్ రేట్ కాస్త తక్కువగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఆయన కేవలం ఒక సెంచరీ మాత్రమే చేయగా, 12 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌లోని మొట్టమొదటి వన్డే మ్యాచ్ జూలై 14న బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే మ్యాచ్ జూలై 16న కార్డిఫ్ మైదానంలో జరుగుతుంది. ఇక ఈ పర్యటనలోని ఆఖరి, మూడో వన్డే మ్యాచ్ జూలై 19న ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఈ వన్డే సిరీస్‌లోనైనా విజయం సాధించి టీమిండియా ఈ పర్యటనను ఘనంగా ముగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




