India U19 vs Pakistan U19 Final: పాక్ ఆటగాళ్లపైకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..సెలబ్రేషన్స్ కిక్కు ఇస్తున్నాయ్ బాసూ..!

India U19 vs Pakistan U19 Final: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఒక్క వికెట్ తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది.

Gagan kumar
Published on: 15 Nov 2026 9:28 AM IST
India U19 vs Pakistan U19 Final
X

India U19 vs Pakistan U19 Final: పాక్ ఆటగాళ్లపైకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..సెలబ్రేషన్స్ కిక్కు ఇస్తున్నాయ్ బాసూ..!

India U19 vs Pakistan U19 Final: క్రికెట్ మైదానంలో అసలైన 'దాయాదుల పోరు' ఎలా ఉంటుందో భారత అండర్-19 కుర్రాళ్లు చూపించారు. విజయం అసాధ్యమనుకున్న స్థితి నుంచి అద్భుతం చేసి, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడారు.

శనివారం జరిగిన ఈ నరాలు తెగే ఫైనల్ పోరులో లక్ష్య రాయ్‌చందాని సారథ్యంలోని టీమిండియా ఒక్క వికెట్ తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ అద్భుత విజయం కంటే.. గెలిచిన వెంటనే భారత కుర్రాళ్లు చేసిన అగ్రెసివ్ సెలెబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

గత కొంతకాలంగా భారత్-పాక్ మ్యాచ్‌లు అంటే ఏకపక్షంగా సాగుతూ అభిమానులకు బోర్ కొట్టిస్తున్నాయి. కానీ ఈ అండర్-19 ఫైనల్ మాత్రం ఆఖరి బంతి వరకు ఊపిరి బిగబట్టేలా సాగింది. లీగ్ దశలో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి, దానికి తోడు ఆఖరి బంతికి గెలిచామన్న పట్టలేని ఆనందంతో భారత కుర్రాళ్ల భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి.

విన్నింగ్ రన్స్ రాగానే భారత ఆటగాళ్లు ఒక్కసారిగా ప్రత్యర్థి ఆటగాళ్ల వైపు దూసుకెళ్లారు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు యశ్వీర్ గౌడ్, పాకిస్థాన్ వికెట్ కీపర్ వైపు దూసుకెళ్లి బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకున్న తీరు హైలెట్‌గా నిలిచింది. రండిరా చూసుకుందాం అన్నట్లుగా భారత ఆటగాళ్లు సంజ్ఞలు చేయడంతో మైదానంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. కుర్రాళ్ల అగ్రెషన్ శ్రుతి మించుతోందని గ్రహించిన భారత సపోర్ట్ స్టాఫ్ మెంబర్ ఒకరు.. వెంటనే మైదానంలోకి పరుగెత్తుకొచ్చి మరీ ఆటగాళ్లను అడ్డుకుని వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఈ సెలెబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. పాక్‌పై అది కూడా ఆఖరి బంతికి గెలిచినప్పుడు ఆ మాత్రం కిక్ ఉండాలి.. నీ అవ్వ తగ్గేదేలే, మ్యాచ్ కన్నా మన కుర్రాళ్ల సెలెబ్రేషన్సే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయ్ అంటూ కొందరు అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మరోవైపు, విజయాన్ని ఆస్వాదించాలి.

కానీ ప్రత్యర్థి ఆటగాళ్లపైకి ఇలా దూసుకెళ్లడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, యువ ఆటగాళ్లు సంయమనం పాటించాలని మరికొందరు హితవు పలుకుతున్నారు. ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 338 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.

అయితే, ఆ స్థితిలో మనల్ చౌహాన్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మోహిత్ ఉల్వా (26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) ఆకాశమే హద్దుగా చెలరేగారు. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని కరిగించారు.

చివరి ఓవర్లో ఉత్కంఠ నడుమ భారత్ 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఫైనల్లో హాఫ్ సెంచరీతో పాటు టోర్నీ ఆసాంతం 361 పరుగులతో రాణించిన ఆర్యవీర్ సెహ్వాగ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.