IND vs AFG: అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్లుగా ఎవరంటే?
IND vs AFG: ఇటీవలి ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఈ టెస్టు బరిలోకి దిగుతోంది.
IND vs AFG: అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్లుగా ఎవరంటే?
IND vs AFG: ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత సీజన్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు మళ్లీ సంప్రదాయ రెడ్ బాల్ క్రికెట్ సమరానికి సిద్ధమైంది. అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా సరికొత్త తుది జట్టును (ప్లేయింగ్-11) సిద్ధం చేశారు. జూన్ 6 నుంచి 10 వరకు జరిగే ఈ పోరులో యువ రక్తం సత్తా చాటడానికి ఉరకలేస్తోంది.
కొత్త ఉత్సాహంతో రెడ్ బాల్ సమరం..
ఇటీవలి ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఈ టెస్టు బరిలోకి దిగుతోంది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న టీమ్ ఇండియా, ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్ దిశా నిర్దేశంలో మళ్లీ టెస్టుల్లో తన పూర్వ వైభవాన్ని, ఆధిపత్యాన్ని చాటుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే సీనియర్ల గైర్హాజరీలో సరికొత్త కాంబినేషన్‌తో అఫ్గాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు రచించారు.
ఓపెనింగ్ బాధ్యతలు ఆ ఇద్దరిదే!
ఈ కీలక మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే బాధ్యతను కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ భుజానికెత్తుకోనున్నారు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో గిల్ గాయపడటంతో కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఓపెనర్లుగా రావలసి వచ్చింది. కానీ ఇప్పుడు గిల్ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి రావడంతో, జైస్వాల్‌తో కలిసి అతడే ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరూ అందిచే శుభారంభంపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంది.
పుజారా స్థానంలో దేవదత్ పడిక్కల్..
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో స్థానమంటే మనకు చేతేశ్వర్ పుజారా గుర్తుకు వస్తారు. ఆయన జట్టుకు దూరం అయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే సరైన బ్యాటర్ కోసం అన్వేషణ సాగింది. ఇప్పుడు ఆ నమ్మకమైన స్థానాన్ని దేవదత్ పడిక్కల్ భర్తీ చేయనున్నాడు. ఈ ఏడాది దేశీవాళీ క్రికెట్‌లో పడిక్కల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఒక ద్విశతకం, రెండు శతకాలతో పాటు పలుమార్లు సెంచరీ చేజార్చుకున్న రికార్డు అతనికుంది. ఇన్నింగ్స్‌ను నిలకడగా ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న పడిక్కల్‌కు టెస్టు జట్టులో తన స్థానాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. ఇక నాలుగో స్థానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. రిషబ్ పంత్, రాహుల్‌లలో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉండటంతో మేనేజ్‌మెంట్ రాహుల్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మిడిల్ ఆర్డర్‌కు నితీష్, జురెల్ భరోసా..
భారత ఇన్నింగ్స్ మధ్య పరుగులను నిలబెట్టే బాధ్యతను ధ్రువ్ జురెల్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అందుకోనున్నారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఒత్తిడి సమయాల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చిన ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టుకు బలం కానున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి కూడా తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అవసరమైనప్పుడు వేగంగా పరుగులు సాధిస్తూ, కీలక సమయాల్లో వికెట్లు తీయగల నితీష్ జట్టుకు అదనపు బలంగా మారనున్నాడు.
టీమ్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ (Playing XI): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నుర్ బ్రార్.
యువ ఆటగాళ్లతో ప్రయోగాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ, కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకం, ఆటగాళ్ల తాజా ఫామ్ చూస్తుంటే అఫ్గానిస్తాన్‌పై భారత్ స్పష్టమైన ఆధిక్యం సాధించేలా కనిపిస్తోంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ యువ క్రికెటర్ల భవిష్యత్తుకు దిక్సూచిగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




