IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై ఉత్కంఠ.. కేంద్రం అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూపులు!

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.

Rishvik
Published on: 13 Aug 2026 7:49 PM IST
IND vs BAN
X

IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై ఉత్కంఠ.. కేంద్రం అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూపులు!

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. బంగ్లాదేశ్ పర్యటనకు భారత పురుషుల క్రికెట్ జట్టు వెళ్లే విషయంపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ పర్యటనకు భారత ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రావాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు తాజాగా తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం ఈ అంశంపై భారత హైకమిషన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాతే బంగ్లాదేశ్ పర్యటనపై స్పష్టత రానుంది.

ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ దేశాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వ అనుమతిపైనే ఆధారపడి ఉంటుందని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే సిరీస్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితికి వచ్చినట్లు కూడా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే భారత్ పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి విండోను ఖరారు చేయలేదు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఇరు బోర్డులు చర్చించి సిరీస్‌కు అనువైన తేదీలను నిర్ణయించే అవకాశం ఉంది.

భారత్, బంగ్లాదేశ్ దేశాల క్రికెట్ సంబంధాల్లో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2026 జనవరిలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ ప్రాంచైజీని బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింసకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2025 డిసెంబర్ వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో ఐపీఎల్‌లో ఎంపికైన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు అతడే. ఆ తర్వాత కొద్ది రోజులకే 2026 టీ20 ప్రపంచకప్ కోసం భారత పర్యటనకు తమ జట్టు వెళ్లబోదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భద్రతా కారణాలతో పాటు బంగ్లాదేశ్ ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి మరో దేశానికి మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)ని కోరినా.. ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఢాకాలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సమావేశం నిర్వహించింది. భారత్‌తో క్రికెట్ సంబంధాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అనంతరం బీసీబీ.. బీసీసీఐకి సాధారణ క్రికెట్ సంబంధాల్లో భాగంగా ఇమెయిల్ పంపినట్లు తెలిపింది. అందులో భారత జట్టు ప్రతిపాదిత బంగ్లాదేశ్ పర్యటన, బంగ్లాదేశ్ మహిళల జట్టు భారత పర్యటనతో పాటు ఇరు బోర్డుల మధ్య భవిష్యత్తులో సహకారానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం బీసీసీఐ, బీసీబీ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నప్పటికీ.. భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వ అనుమతిపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే సిరీస్‌కు కొత్త విండోను రూపొందించి పర్యటనను ఖరారు చేసే అవకాశం ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story