IND vs ENG 1st T20I: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి పెను ముప్పు!
IND vs ENG 1st T20I: Vaibhav Sooryavanshi's Debut. భారత్, ఇంగ్లండ్ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే వాతావరణం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
IND vs ENG 1st T20I: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి పెను ముప్పు!
IND vs ENG 1st T20I: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ స్టేడియంలో ఆరంభం కానుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే వాతావరణం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం మైదానం పరిసరాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో మొదటి టీ20కి వర్షం ముప్పు నెలకొంది. దీంతో టాస్‌తో పాటు మ్యాచ్ ప్రారంభం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఐర్లాండ్ ఓటమి తర్వాత భారత్‌కు కీలక పరీక్ష:
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ఇటీవల ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఆ నిరాశ నుంచి కోలుకుని ఇంగ్లండ్‌పై విజయంతో సిరీస్‌ను ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న ఇంగ్లండ్ కూడా మంచి ప్రదర్శన చేయాలని చూస్తోంది. దీంతో తొలి టీ20పై భారీ ఆసక్తి నెలకొంది.
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై సస్పెన్స్:
ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఉంది. ఐర్లాండ్ సిరీస్‌లో జట్టులో ఉన్నప్పటికీ అతడికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. దీంతో ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అయినా బుడ్డోడికి ఛాన్స్ దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
సూర్యవంశీ అరంగేట్రానికి ఇప్పుడు వర్షం పెను ముప్పుగా మారింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులను కూడా అందుకున్నాడు.
గవాస్కర్ సహా పలువురు మాజీలు మద్దతు:
వైభవ్ సూర్యవంశీకి తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతడిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురావాలని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది టాస్ సమయానికే తేలనుంది.
పేసర్లకు అనుకూల పరిస్థితులు:
ప్రస్తుతం చెస్టర్-లీ-స్ట్రీట్‌లో పూర్తిగా మేఘాలు కమ్ముకున్న వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బంతితో పేసర్లకు స్వింగ్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో బ్యాటర్లకు ఆరంభంలోనే గట్టి పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం వర్షం అంతరాయం లేకుండా పూర్తి మ్యాచ్ జరగాలని ఆశిస్తున్నారు.
హెడ్ టు హెడ్‌లో భారత్ ఆధిక్యం:
భారత్-ఇంగ్లండ్ టీ20 రికార్డులను పరిశీలిస్తే టీమిండియాదే పైచేయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తలపడిన 30 మ్యాచ్‌ల్లో భారత్ 18 విజయాలు, ఇంగ్లండ్ 12 విజయాలు సాధించింది. అలాగే ఇరు జట్ల మధ్య జరిగిన గత ఏడు టీ20ల్లో భారత్ ఏకంగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఆధిపత్యం చాటింది. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని శ్రేయస్ సేన చూస్తోంది.




