టీమిండియాలోకి కొత్తగా నాలుగు బ్రహ్మాస్త్రాలు.. బరిలోకి దిగితే ప్రత్యర్థులకు బడితపూజే!

Team India: ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియాలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. సీనియర్ల స్థానంలో యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే పట్టుదలతో భారత బోర్డు ఉంది.

Venkat
Published on: 4 Jun 2026 5:19 PM IST
Team India
X

టీమిండియాలోకి కొత్తగా నాలుగు బ్రహ్మాస్త్రాలు.. బరిలోకి దిగితే ప్రత్యర్థులకు బడితపూజే!

Team India squad announcement: భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తదుపరి సిరీస్‌ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 6వ తేదీన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ పర్యటనల్లో నలుగురు యువ సంచలనాలు భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

యువ రక్తంపైనే బీసీసీఐ కన్ను..

ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియాలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. సీనియర్ల స్థానంలో యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే పట్టుదలతో భారత బోర్డు ఉంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో, జులై 26 నుంచి ఐర్లాండ్‌తో జరగబోయే పొట్టి ఫార్మాట్ సమరాల కోసం కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లతో కూడిన సరికొత్త జట్టును ఎంపిక చేయనున్నారు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నలుగురు ఆటగాళ్లకు ఈ పర్యటనలో జాతీయ జట్టు టోపీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

పరుగుల యంత్రం.. వైభవ్ సూర్యవంశీ..

ఇటీవలి ఐపీఎల్ సీజన్‌లో తన సంచలన బ్యాటింగ్‌తో దేశం మొత్తాన్ని ఆకర్షించిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఈ యువ బ్యాటర్ కేవలం 16 మ్యాచ్‌ల్లోనే 237.30 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ సాయంతో ఏకంగా 776 పరుగులు సాధించి, సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఆడిన 34 దేశవాళీ టీ20 మ్యాచ్‌ల్లో 4 శతకాలు, 6 అర్ధశతకాలతో 1477 పరుగులు చేసిన వైభవ్‌కు తొలిసారి భారత జట్టు నుంచి పిలుపు రావడం ఖాయమైంది.

లక్నో స్పీడ్‌స్టర్.. ప్రిన్స్ యాదవ్..

లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడి, తన వేగవంతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్. 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బౌలర్ నిలకడగా లైన్ అండ్ లెంగ్త్ మెయింటైన్ చేస్తూ, వికెట్లు తీయడంలో దిట్ట. ఢిల్లీ ప్రీమియర్ లీగ్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లోనూ రాణించిన ప్రిన్స్, ఇప్పటివరకు 51 దేశవాళీ మ్యాచ్‌ల్లో 68 వికెట్లు పడగొట్టాడు. భవిష్యత్తు పేస్ గుర్రంగా ఇతడిని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయనున్నారు.

పవర్‌ప్లే వీరుడు.. ప్రభ్‌సిమ్రన్ సింగ్..

ఓపెనింగ్‌లో వచ్చి పవర్‌ప్లేను సమర్థవంతంగా వాడుకుంటూ బౌండరీల వర్షం కురిపించగల సత్తా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్. 25 ఏళ్ల ఈ పంజాబ్ ముద్దుబిడ్డ టీమ్ ఇండియాకు అదనపు కీపింగ్ ఆప్షన్‌గా కూడా ఉపయోగపడనున్నాడు. 129 దేశవాళీ టీ20 మ్యాచ్‌ల్లో 151.50 స్ట్రైక్ రేట్‌తో 2 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో కలిపి 3665 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్‌కు ఎట్టకేలకు జాతీయ జట్టులో స్థానం దక్కే సమయం ఆసన్నమైంది.

హైదరాబాద్ ఆశాకిరణం.. సాకిబ్ హుస్సేన్..

ఈ జాబితాలో చివరిగా వినిపిస్తున్న పేరు బిహార్‌కు చెందిన యువ బౌలర్ సాకిబ్ హుస్సేన్. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరసపున ఆడిన సాకిబ్, లీగ్‌లో దొరికిన 11 అవకాశాలలోనే 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఘనత కూడా ఇతని ఖాతాలో ఉంది. దేశవాళీ క్రికెట్‌లో 25 టీ20 వికెట్లు తీసిన సాకిబ్‌ను భవిష్యత్తు బ్యాకప్ బౌలర్‌గా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తోంది.

ఐపీఎల్‌లో తమ ప్రతిభను చాటుకుని, కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ నలుగురు యువ ఆటగాళ్లకు జూన్ 6న ప్రకటించే జట్టులో చోటు దక్కితే, అది భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమే. విదేశీ గడ్డపై ఈ నవతరం ఆటగాళ్లు ఏ మేరకు రాణించి తదుపరి తరం తారలుగా ఎదుగుతారో చూడాలి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story