జపాన్‌ను వణికిస్తున్న దుజాన్ తుఫాను.. భారత్ చారిత్రక మ్యాచ్‌కు రెయిన్ ఎఫెక్ట్..?
India vs Japan T20: ఆసియా క్రీడలు (Asian Games 2026) వేదికగా జపాన్ దేశంలో అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు (Team India) ఆతిథ్య దేశంతో తలపడే చారిత్రక ఏకైక టీ20 మ్యాచ్‌పై తుఫాను నీడ కమ్ముకుంది.
జపాన్‌ను వణికిస్తున్న దుజాన్ తుఫాను.. భారత్ చారిత్రక మ్యాచ్‌కు రెయిన్ ఎఫెక్ట్..?
India vs Japan T20: జపాన్ పసిఫిక్ తీర ప్రాంతాన్ని భయపెడుతున్న శక్తివంతమైన దుజాన్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విపరీత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే మూడు వందలకు పైగా విమాన సర్వీసులు రద్దుకాగా, లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పలు ఈక్వెస్ట్రియన్ పోటీలను మంగళవారానికి వాయిదా వేశారు. సరిగ్గా ఇదే సమయంలో జపాన్‌లోని టోచిగి ప్రిఫెక్చర్ పరిధిలోని సానో ఇర్జాతీయ క్రికెట్ మైదానంలో భారత్, జపాన్ జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. జపాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన కాంటో ప్రాంతంలోనే ఈ వేదిక ఉండటంతో మ్యాచ్ నిర్వహణపై నీలి నీడలు అలుముకున్నాయి.
అయితే తాజా వాతావరణ అంచనాల ప్రకారం మ్యాచ్‌కు పూర్తి స్థాయి అంతరాయం కలిగే ప్రమాదం లేదని స్పష్టమవుతోంది. సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, మంగళవారం ఉదయం నాటికి వాతావరణం మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. కాస్త ఎండ కాసే అవకాశం ఉండటంతో పాటు మధ్యాహ్నం వేళల్లో చిన్నపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరిగే సమయాల్లో స్వల్ప అంతరాయాలు ఏర్పడినప్పటికీ, పూర్తిగా మ్యాచ్ రద్దయ్యే స్థాయిలో భారీ వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు.
ఇరు దేశాల పురుషుల జట్లు అంతర్జాతీయ వేదికపై పరస్పరం తలపడటం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఆసియా క్రీడల మహిళల క్రికెట్ క్వార్టర్స్‌లో భారత మహిళా జట్టు జపాన్‌తో తలపడగా, ఆ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు పురుషుల జట్ల మధ్య జరగనున్న ఈ చారిత్రక సమరం సజావుగా సాగుతుందని భావిస్తున్న అభిమానులకు వాతావరణ శాఖ తాజా నివేదిక ఊరటనిస్తోంది.




